UP assembly election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. ప్ర‌ధాన పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో వేగం పెంచాయి. క‌రోనా నేప‌థ్యంలో డిజిట‌ల్ క్యాంపెయిన్ నిర్వ‌హించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ ఒడిపోవ‌డం ఖాయ‌మ‌ని బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావ‌తి అన్నారు.  

UP assembly election 2022: దేశంలో ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election 2022) కేంద్ర ఎన్నికల సంఘం శ‌నివార‌మే షెడ్యూల్ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో.. ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో ముగియ‌నుంది. మొత్తం 400 కు పైగా అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది. రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో వేగం పెంచాయి. అయితే, ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతుండటం ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌లు, స‌మావేశాల‌పై ప్ర‌భావం ప‌డింద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. 

యూపీ (UP assembly election)లో త‌మ‌దే విజ‌య‌మంటే.. త‌మ‌దే గెల‌పు అంటూ ప్ర‌ధాన పార్టీలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో బీజేపీ ఒడిపోవ‌డం ఖాయ‌మ‌ని బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావ‌తి అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా లేదా ఓటింగ్ యంత్రాంగాన్ని తారుమారు చేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఓడిపోతుందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి (Mayawati)మాయావతి అన్నారు. "ప్రభుత్వ యంత్రాంగంలో ఎన్నికల సంఘం (Election Commission) అప్ర‌మ‌త్త‌త.. భయం అవసరం. ఈసీ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి... ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా, ఓటింగ్ యంత్రాలను తారుమారు చేయకుంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవ‌డం ఖాయం" అని మీడియా సమావేశంలో మాయావతి అన్నారు.

అలాగే, "ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (assembly election) ప్రశాంతంగా జరగాలి. పోలీసు యంత్రాంగం పక్షపాతం లేకుండా పని చేయాలి. ఉత్తరప్రదేశ్ ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలి. మా పార్టీ ఎన్నిక‌ల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తుంది. పార్టీ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశానికి నేను (Mayawati)అధ్యక్షత వహిస్తాను. అభ్యర్థుల తుది ఎంపికకు సంబంధించి నేడు నిర్ణ‌యం తీసుకుంటాం" అని మాయావతి అన్నారు. ఇదిలావుండగా, రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆదివారం నాడు లక్నోలో ఆ పార్టీ అధికారుల ఉన్నత స్థాయి సమావేశం జ‌ర‌గ‌నుంది. దీనికి బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి (Mayawati) అధ్యక్షత వహించనున్నారు.

కాగా, దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి శ‌నివారం నాడు ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 403 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల వివ‌రాల‌ను గ‌మ‌నిస్తే.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అఖండ విజయం సాధించింది. 403 మంది సభ్యుల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో BJP 39.67 శాతం ఓట్లను సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ (SP) 47 సీట్లు, బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ (BSP) 19 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 7 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.