చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం వెనక మలుపు ఏమిటనే చర్చ ప్రారంభమైంది. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయాన్ని తమిళనాడు బిజెపి స్వాగతించింది. అంతేకాకుండా జయలలిత, కరుణానిధి మరణించిన తర్వాత తమిళ రాజకీయాల్లో చరిష్మా గల నాయకులు లేకుండా పోయారని, ఆ ఖాళీని రజనీకాంత్ భర్తీ చేస్తారని బిజెపి అధికార ప్రతినిధి నారయణన్ తిరుపతి అభిప్రాయపడ్డారు. తమకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. 

అంతేకాకుండా, తన రాజకీయాల సమన్వయకర్తగా రజినీకాంత్ ఎంచుకున్న వ్యక్తి విషయంలో కూడా ఓ మలుపు ఉన్నట్లు కనిపిస్తోంది. రజినీకాంత్ అర్జున్ మూర్తిని తన పార్టీ సమన్వయకర్తగా ప్రకటించారు. అర్జున్ మూర్తి బిజెవి మేధావివర్గం విభాగంలో పనిచేస్తున్నారు.

Also Read: ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన రజినీకాంత్

రజినీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతించడంతో పాటు అర్జున్ మూర్తిని తన పార్టీ సమన్వయకర్తగా రజినీకాంత్ నియమించుకోవడం వెనక రాజకీయ కోణం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆర్ఎస్ఎస్ నేత గురుమూర్తి రజినీకాంత్ తో భేటీ అయ్యారు. 

తన పార్టీ ఆధ్యాత్మిక లౌకిక రాజకీయాలను నడుపుతుందని, మతపరమైన, కులపరమైన విభేదాలు ఉండవని రజినీకాంత్ చెప్పారు. తమిళ ప్రజల కోసం తన ప్రాణాలనైనా త్యాగం చేస్తానని ఆయన చెప్పారు. 

Also Read: తమిళనాడును సమూలంగా మారుస్తా,విజయం మాదే: రజనీకాంత్ ధీమా

ప్రధాని మోడీతో పాటు కొంత మంది బిజెపి నేతలతో భేటీ అయినప్పటికీ రజినీకాంత్ ఏ రాజకీయ పార్టీ వైపు కూడా మొగ్గు చూపలేదు. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన సమయంలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను ఆయన కృష్ణార్జునులుగా కీర్తించారు. 

గత పాతికేళ్లుగా రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు ఇస్తూనే రజినీకాంత్ వాయిదా వేస్తూ వచ్చారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని ఆయన చెప్పారు.