చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని సినీ నటుడు రజనీకాంత్ ప్రకటించారు.వచ్చే ఏడాదిలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.గురువారం నాడు ఉదయం తన ఇంటి వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. 

తమిళనాడు కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా చెప్పారు.తమిళనాడును మార్చే అవకాశం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.మొత్తం మారుస్తా.. సమూలంగా తమిళనాడును మారుస్తానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

also read:ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన రజినీకాంత్

కులం, మతం లేకుండా నిజాయితీ,పారదర్శక, అవినీతి రహిత ఆధ్యాత్మిక రాజకీయాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక అద్భుతం జరుగుతుంది, కచ్చితంగా అద్బుతం జరుగుతుందని ఆయన తేల్చి చెప్పారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం కావాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు.  కొత్త పార్టీ ఏర్పాటు విషయమై ఈ నెల 31వ తేదీన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టుగా రజనీకాంత్ ప్రకటించారు.

కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని రజనీకాంత్ చాలాకాలంగా చెబుతున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై రజనీకాంత్ ఇవాళ స్పష్టత ఇచ్చారు. రజనీకాంత్ తమిళ ప్రజలకు స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే సిద్దమౌతున్నాయి.