బీజేపీ రెండు భారత్ లను నిర్మించాలని భావిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. రాజస్థాన్ లోని బన్స్ వారా లో చేపట్టిన ర్యాలీలో ఆయన బీజేపీ పై, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు.
దేశం ప్రస్తుతం రెండు సిద్ధాంతాల మధ్య పోరాటాన్ని ఎదుర్కొంటోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రజలను కలుపుకొని, సమాజంలోని అన్ని వర్గాల వారికి సహాయం చేయాలని కాంగ్రెస్ చూస్తుండగా, బీజేపీ రెండు భారతాలను నిర్మించాలని కోరుకుంటోందని ఆరోపించారు. రాజస్థాన్ లోని బన్స్ వారా లోని కరానా గ్రామంలో జరిగిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Congress: 2024 లోక్‌సభ ఎన్నికల గెలుపే లక్ష్యం.. మరో రెండు రోజుల్లో టాస్క్‌ఫోర్స్: సోనియా గాంధీ
‘‘ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం. ఒక వైపు కాంగ్రెస్ భావజాలం ఉంది. ఇది ప్రతి ఒక్కరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు, ప్రతీ ఒక్కరినీ గౌరవిస్తూ, ప్రతీ ఒక్కరి చరిత్రను, సంస్కృతిని పరిరక్షిస్తూ ముందుకు సాగుతోంది. అయితే మరోవైపు గిరిజనుల చరిత్రను, సంస్కృతిని చీల్చి చెండాడుతూ బీజేపీ విభజనలను సృష్టిస్తోంది. ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న పోరాటం ఇది. మేము ప్రజలను కలుపుతాం. వారు ప్రజలను విభజిస్తారు. మేము బలహీనులకు సాయం చేస్తాం. వారు బడా పారిశ్రామికవేత్తలకు సాయం చేస్తారు. ’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
అధికార బీజేపీ రెండు భారతదేశాలను సృష్టించాలని కోరుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకటి ధనవంతులకు, బడా పారిశ్రామికవేత్తలకు కాగా మరొకటి పేదలు, గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల వారికి, బలహీనుల కోసమని అన్నారు. ‘‘ మాకు రెండు భారతదేశాలు వద్దు. ప్రతీ ఒక్కరూ తమ కలలను నెరవేర్చుకునే ఉండే ఒకే భారతదేశాన్ని మేము కోరుకుంటున్నాం’’ అని ఆయన అన్నారు.
Congress: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. రానున్న లోక్‌సభ ఎన్నికల నుంచి వారికే 50% పైగా సీట్లు
ఈ ర్యాలీకి ముందు రాహుల్ గాంధీ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తో కలిసి దుంగార్పూర్ లోని వాల్మీకి ఆలయంలో ప్రార్థనలు చేశారు. గిరిజన సమాజంతో తమ పార్టీకి గతం నుంచే లోతైన సంబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేస్తోందని ఆరోపించారు. ‘‘ ప్రధాని పెద్దనోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీని అమలు చేశారు. ఇది మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. అంతకు ముందు యూపీఏ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పని చేసింది. అయితే బీజేపీ, ప్రధాని నరేంద్ర దానికి హాని కలిగించారు. ప్రస్తుతం దేశంలో యువతకు ఉద్యోగం రాలేని పరిస్థితి నెలకొంది’’ అని ఆయన అన్నారు.
‘‘ మీ చరిత్రను మేం కాపాడుకుంటాం. మీ చరిత్రను తుడిచివేయడం లేదా అణచివేయడం మాకు ఇష్టం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మీ భూమి, అడవులు, నీటిని పరిరక్షించడానికి మేము ఒక చారిత్రాత్మక చట్టాన్ని తీసుకువచ్చాం. పెసా, భూసేకరణ బిల్లు ద్వారా మీ సంపదను, అడవుల్లో మీ ఉత్పత్తులను కాపాడుకున్నాం. దాని ప్రయోజనాలను గిరిజనులకు అందించాం ’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
