Rahul Gandhi padyatra: కాంగ్రెస్‌కు సామాన్యులతో సంబంధాలు తెగిపోయాయని, ప్రజల్లోకి వెళ్లడం ద్వారా దాన్ని సరిదిద్దాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీని కోసం దేశ‌వ్యాప్త యాత్ర చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.  

Chintan Shivir: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పార్టీని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ మూడు రోజుల మేధోమథనం సెషన్ 'చింతన్ శివిర్'ను నిర్వహిస్తోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్‌కు సామాన్యులతో సంబంధాలు తెగిపోయాయని, ప్రజల్లోకి వెళ్లడం ద్వారా దాన్ని సరిదిద్దాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీని కోసం దేశ‌వ్యాప్త యాత్ర చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌లో కాంగ్రెస్ దేశవ్యాప్త యాత్ర షురు అవుతుంద‌ని తెలిపారు. అంత‌కు ముందు చ‌ర్చ‌ల సంద‌ర్భంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్త పాద‌యాత్ర సైతం తెర‌మీద‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఈ పాద‌యాత్ర సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు దేశ‌వ్యాప్త యాత్ర‌తో ఇది భాగంగా ఉండ‌నుంద‌ని స‌మాచారం. 

కాంగ్రెస్ వ‌ర్గాల ప్ర‌కారం.. ప్ర‌జానుకూల‌ అజెండాను ముందుకు తెచ్చేందుకు మరియు ప్రభుత్వ వైఫల్యాలను మరియు ప్రజల కష్టాలను ఎత్తిచూపడానికి రాష్ట్ర నాయకులు ప్రతి రాష్ట్రంలో ఇలాంటి పాదయాత్రలు నిర్వహించ‌నున్నారు. రాహుల్ పాద‌యాత్ర‌లో ఇవి భాగంగా కొన‌సాగ‌నున్నాయ‌ని తెలిపాయి. అయితే, కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు రాహుల్ గాంధీ చేప‌ట్టే పాద‌యాత్ర పై CWC తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. రాహుల్ గాంధీ ఈ స‌మావేశంలో ఆదివారం నాడు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కి సామాన్యులతో సంబంధాలు తెగిపోయాయని, ప్రజల్లోకి వెళ్లడం ద్వారా దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న అంగీకరించారు. "మేము వ్యక్తులతో మా సంబంధాల‌ను పునరుద్ధరించాలి మరియు అది విచ్ఛిన్నమైందని అంగీకరించాలి. మేము దానిని బలపరుస్తాము, ఇది ఏ షార్ట్‌కట్‌తో జరగదు.. దీనికి స‌మిష్టి కృషి అవసరం… ప్రజలతో సంబంధాలను బలోపేతం చేయడానికి అక్టోబర్‌లో కాంగ్రెస్ దేశవ్యాప్త యాత్రను చేపడుతుంది” అని రాహుల్ గాంధీ చెప్పారు.

ఈ క్ర‌మంలోనే కేంద్రంపై కూడా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు దేశంలో గ‌ళాన్ని వినిపించ‌డానికి.. స్వేచ్ఛ‌గా సంభాషణలకు అనుమతి లేని విధంగా పాల‌న సాగుతున్న‌ద‌ని తెలిపారు. నేడు ప్ర‌జా గొంతుకలు మూగ‌బోయిన‌ట్టుగా ఉన్న ప‌రిస్థితుల‌ను చూస్తున్నాము.. దాని ప‌ర్యావ‌స‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహ‌కంద‌టం లేద‌ని అన్నారు. "పెగాసస్ సాఫ్ట్‌వేర్ కాదు.. ఇది దేశంలోని రాజకీయ వర్గాన్ని నిశ్శబ్దం చేసే మార్గం.. రాజకీయ సంభాషణ గొంతు నొక్కే చ‌ర్య‌లు" అని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ పాలనలో అభిప్రాయాలు చెప్పడం కూడా నేరంగా మారిందన్నారు. బీజేపీలో ద‌ళితుల‌కు స్థానం లేకుండా పోయిందన్నారు. దళితులు, గిరజనులు అణచివేతకు గురౌతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అన్ని రీజినల్ పార్టీలు దళితులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. బీజేపీ పాలనలో అన్ని వర్గాలు అణచివేతకు గురయ్యార‌న్నారు. 

కాగా, సంస్థాగత, రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ, సామాజిక న్యాయం మరియు యువతకు సంబంధించిన అంశాలపై రెండు రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత, దీని కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానెల్లు తమ నివేదికలను కాంగ్రెస్ అధ్యక్షుడికి సమర్పించాయి.. అవి తుది ఆమోదం కోసం CWCకి ఇవ్వబడతాయి. కాంగ్రెస్ ఎప్పుడూ భయపడకుండా, ఆందోళన లేకుండా చర్చలకు ప్రజలకు వేదిక కల్పిస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.