కుల జనగణనపై కేంద్రం వైఖరి ఇదేనా? బిహార్ సర్వేపై అమిత్ షా వ్యాఖ్యలు
కుల గణనపై బీజేపీ వైఖరిపై అనిశ్చితి ఉన్నది. ఈ రోజు బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో ఓ స్పష్టత వచ్చింది. బీజేపీ కుల గణనకు వ్యతిరేకం కాదనే సంకేతాలను ఆయన ఇచ్చారు.
న్యూఢిల్లీ: బిహార్‌లో కుల జనగణన గణాంకాలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. బీసీల జనాభా అనుకున్న దాని కంటే గణనీయంగా అధికంగా ఉన్నట్టు తేలింది. దీంతో న్యాయబద్ధంగా దామాషా పద్ధతిన ఫలాలు తమకు అందాలనే డిమాండ్ బలంగా వినిపించడానికి ఈ కుల గణన దోహదపడనుంది. ఈ ఎన్నికల్లో కుల గణన కూడా కీలకమైన అంశంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి ఏకంగా దేశవ్యాప్తంగా కుల గణన చేపడుతామని హామీ ఇచ్చింది. తమ హయాంలో కుల గణన నిర్వహించినా గణాంకాలను మాత్రం మోడీ ప్రభుత్వం విడుదల చేయడం లేదని మండిపడుతున్నది. దీంతో కుల గణనకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకి అన్నట్టుగా అభిప్రాయాలు వచ్చాయి. ఇప్పటికీ కుల గణనపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అస్పష్టంగానే ఉండింది.
బిహార్ కుల గణన అంచనాలపై ఆ రాష్ట్ర బీజేపీ నేతలు రకరకాలుగా కామెంట్లు చేశారు. కానీ, జాతీయ స్థాయి నాయకులు మాట్లాడలేదు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ కుల గణనపై స్పందించారు. తద్వార బీజేపీ వైఖరిని ఆయన వెల్లడించినట్టయింది.
ఈ రోజు ముజఫర్‌పూర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. నితీశ్ ప్రభుత్వం సంతుష్టివాద రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. బిహార్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో ఉద్దేశపూర్వకంగా ముస్లింలు, యాదవ్‌ల జనాభా అధికంగా ఉన్నట్టు ప్రకటించిందని ఆరోపించారు.
Also Read: ఇండియా కూటమి బాయ్‌కాట్ చేసిన జర్నలిస్టుతో కాంగ్రెస్ లీడర్ కమల్‌నాథ్ ఇంటర్వ్యూ
అయితే, కుల గణన చేపట్టాలనే నిర్ణయం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ.. ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్నప్పుడే జరిగిందని అమిత్ షా ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతో పరోక్షంగా తాము కుల గణనకు వ్యతిరేకం కాదనే సంకేతాలను ఇచ్చారు. గత కుల గణన గణాంకాలను కేంద్ర ప్రభుత్వం బయటికి వెల్లడించలేకపోవచ్చు. కానీ, కుల గణనను రాజకీయ కారణాలు లేదా మరే కారణాలైనా బీజేపీ మాత్రం వ్యతిరేకించలేదు. నిన్న ఆప్ కూడా ఇదే కామెంట్ చేసింది. కుల గణనపై బీజేపీ యూటర్న్ తీసుకున్నదని, కుల గణను ఇప్పుడు బీజేపీ విమర్శించడం లేదని పేర్కొంది.