Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ సత్యేంద్ర జైన్ జైలు వీడియో.. ఈ సారి అందులో ఎవరున్నారంటే..

తీహార్ జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కు సంబంధించిన మరో వీడియో కలకలం రేపుతోంది. ఈ సారి సత్యేంద్ర దర్బార్ లో ఎవరున్నారో చూడండి అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు బీజేపీ నేత. 

BJP releases video of Tihar jail official meeting Delhi minister Satyendar Jain
Author
First Published Nov 26, 2022, 1:52 PM IST

ఢిల్లీ :  ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్  ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్నారు. కాగా, జైల్లో ఆయనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కొన్ని ఇప్పటికే హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంట్లో అప్పటి జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ఉన్నారు. ఆయన జైలు గదిలో మంత్రిని కలిసినట్లు ఇందులో కనిపిస్తోంది. జైలులో సత్యేంద్ర జైన్ కు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం అజిత్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ  సంగతి తెలిసిందే. 

ఈరోజు వెలుగు చూసిన ఈ తాజా వీడియోను బిజెపి ట్విటర్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో పలువురు మంత్రి సత్యేంద్రజైన్ ను జైలు గదిలో కలిసి మాట్లాడుతున్నారు. విజిటింగ్ అవర్స్ ముగిసిన తరువాత అజిత్ కుమార్ మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది. అజిత్ కుమార్ రాగానే అప్పటివరకు మంత్రితో మాట్లాడుతున్న మిగతా వారంతా బయటికి వెళ్లిపోయారు. దీనిమీద బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

పండ్లు, ప్రూట్ సలాడ్స్: జైలులో మంత్రి సత్యేంద్ర జైన్‌ భోజనంపై వీడియోలు 

‘తీహాడ్ జైలులో సత్యేంద్ర జైన్ కు సంబంధించి మరో వీడియోను మీడియా బయటపెట్టింది. ఈసారి ఆ ఫుటేజ్ లో సత్యేంద్ర దర్బార్ లో జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ కనిపిస్తున్నారు. అజిత్ కుమార్ ఇప్పటికే సస్పెండయ్యారు. రేపిస్టు తో శరీర మర్దన చేయించుకోవడం, జైలులో విలాసవంతమైన ఆహారం తెప్పించుకోవడం..లాంటి వాటి తర్వాత ఈ దృశ్యాలు వచ్చాయి. అవినీతిపై ఆప్ జరిపే పోరాటం ఇదేనా? కేజ్రీవాల్ దీనిని సమర్థించుకుంటారా? సత్యేంద్ర జైన్ ను తొలగిస్తారా? అని బీజేపీ షెహజాద్ పూనావాలా మండిపడ్డారు.

ఇదిలా ఉంటే, జైలుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు మీడియాలో లీక్ అవ్వడం, చక్కర్లు కొట్టడంపై మంత్రి సత్యేంద్ర జైన్ కోర్టును ఆశ్రయించారు. ఆ వీడియోలు మీడియాలో టెలికాస్ట్ కాకుండా చూడాలని,  అసలు ఆ వీడియోలు ఎలా లీక్ అయ్యాయో ఆరా తీయాలని, దీనికోసం విచారణకు ఆదేశించాలని కోరారు.

ఇదిలా ఉండగా, నవంబర్ 19న బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ కు సంబంధించిన సంచలన వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో రాజకీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో తీహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్న సత్యేందర్ జైన్ కు మరో ఖైదీ మసాజ్ చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. బీజేపీ అధికార ప్రతినిధి పూనావాలా ఈ వీడియోను సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఆప్ పై ప్రశ్నలు సంధించారు. 

జైలులో నిబంధనలను పట్టించుకోకుండా సత్యేందర్ జైన్‌కు అనేక సౌకర్యాలు ఈడీ కల్పిస్తున్నట్లు తెలిపారు. సత్యేందర్ జైన్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చినందుకు తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ సస్పెండ్ అయిన కొద్ది రోజుల తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే, తీహార్ జైలు వర్గాల సమాచారం ప్రకారం.. వీడియో పాతది. ఇప్పటికే సంబంధిత అధికారులు, జైలు సిబ్బందిపై జైలు అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios