మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే.. యూపీ సీఎం అభ్యర్థి ఆయనే.. : కేంద్ర హోం మంత్రి
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టత ఇచ్చారు. ఆ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీనే ప్రధానిగా కొనసాగుతారని అన్నారు. కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని సంశయాలనూ ఆయన స్పష్టపరిచారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోనే బీజేపీ బరిలోకి దిగుతుందని, ఆయనే బీజేపీ సీఎం అభ్యర్థి అని వివరించారు.
లక్నో: కేంద్ర హోం మంత్రి Amit Shah ఉత్తరప్రదేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 తర్వాత మళ్లీ ప్రధానమంత్రిగా Narendra Modiనే కొనసాగుతారని అన్నారు. కాగా, Uttar Pradesh సీఎం అభ్యర్థిపైనా ఆయన స్పష్టతనిచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి Yogi Aditya Nathనే బీజేపీ CM Candidate అని వివరించారు. గత సార్వత్రిక ఎన్నికలకు పూర్వం బీజేపీ రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధానిగా నరేంద్ర మోడీ కొనసాగడం డౌటేననే ఊహాగానాలు వచ్చాయి. మోడీకి, RSS శిబిరానికి మధ్య దూరం పెరిగిందని వార్తలు వచ్చాయి. నితిన్ గడ్కరీ పేరూ తెరపైకి వచ్చింది. ఆర్ఎస్ఎస్‌తో నితిన్ గడ్కరీకి సన్నిహిత సంబంధాలున్నాయని, బహుశా ఆయనే ప్రధానమంత్రి అయ్యే అవకాశముంటుందని విశ్లేషణలు వచ్చాయి. కానీ, ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ దక్కిన తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్రుడే కొనసాగారు. తాజాగా, అలాంటి వాదనలు తెరమీదకు రాకముందే హోం మంత్రి అమిత్ షా ఓ స్పష్టత ఇచ్చారు. 2024 తర్వాత మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే బాధ్యతలు చేపడతారని అన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో కరోనా నిర్వహణ, కుంటుపడ్డ అభివృద్ధి ఆరోపణలతో సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై అసంతృప్తి వెలువడింది. సొంత పార్టీ నేతలే ఆయనపై వ్యతిరేకత చూపెట్టారు. దీంతో అధిష్టానం రంగంలోకి దిగింది. సీఎం సహా పలువురు ఎమ్మెల్యేలతో సమావేశాలు జరిపింది. చివరికి బీజేపీ సీఎం అభ్యర్థిగా యోగి ఆదిత్యానాథ్‌యే ఎన్నికల్లోకి దిగాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా, కేంద్ర హోం మంత్రి ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
Also Read: 2024 టార్గెట్: 19 పార్టీల నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా భేటీ
ఉత్తరప్రదేశ్ ఎన్నికలే సార్వత్రిక ఎన్నికలకు దారి వేస్తాయని, యూపీలో గెలుపే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ విజయానికి పునాదులు వేస్తాయని హోం మంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందే ఇక్కడ బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కుటుంబ పార్టీలను విమర్శలు కురిపించిన ఆయన ఉత్తప్రదేశ్ అసెంబ్లీ కోసం కొత్త నినాదాన్ని ప్రకటించారు. ‘మేరా పరివార్.. బీజేపీ పరివార్’ అనే స్లోగన్‌కు తెరతీశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం ఉత్తరప్రదేశ్‌కు అవసరమైనవన్నీ సమకూరుస్తారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు నరేంద్ర మోడీ సారథ్యంలో, 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలో పోరాడి విజయం సాధించాల్సి ఉన్నదని తెలిపారు. భారత మాతను విశ్వగురువుగా నిలబెట్టడానికి ఈ ఎన్నికు కీలకమని వివరించారు.
ఉత్తరప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉన్నదని, కానీ, ముఘల్ పాలన నుంచి 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ఈ రాష్ట్రానికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. బాబా విశ్వనాథ్, రాముడు, క్రిష్ణుడి భూమిగా ఈ రాష్ట్రానికి పేరు వచ్చిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ పేదల కోసం ఏర్పడిందని, ప్రతిపక్షాలు కేవలం వారి కుటుంబాల కోసమే పాలన చేశాయని, మహా అయితే, వారి కుల ప్రయోజనాల కోసమే ఆలోచించాయని ఆరోపించారు.
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నన్ని రోజులు అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని అన్నారని, కానీ, ఎప్పుడు అనే తేదీ మాత్రం చెప్పేవారు కాదని అమిత్ షా విమర్శించారు. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పని పూర్తవుతున్నదని వివరించారు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన పూర్తయిందని, నిర్మాణ పనులూ వేగంగా సాగుతున్నాయని తెలిపారు.