Presidential election: రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు ముందు భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) పార్ల‌మెంట‌రీ బోర్డు శ‌నివారం నాడు స‌మావేశం కానుంది. ఈ మీటింగ్ లో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.  

BJP parliamentary board meeting: దేశ ఉపరాష్ట్రపతి పదవికి పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు శనివారం సాయంత్రం సమావేశం కానుంది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలకు ముందు జరిగే అఖిలపక్ష ఎంపీల సమావేశం తర్వాత బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థి ద్రౌపది ముర్ము సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ ఇతర సీనియర్ నేతలు హాజరవుతారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి త‌ర‌ఫున ద్రౌప‌ది ముర్ము పోటీ చేస్తున్నారు. విప‌క్ష పార్టీలు యశ్వంత్ సిన్హాను బ‌రిలో నిలిపారు. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న గ‌ణాంకాలు, మ‌ద్దతును గ‌మ‌నిస్తే.. ముర్ము విజ‌య‌వ‌కాశాలు అధికంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. 

ద్రౌప‌ది ముర్ము గ‌న‌క రాష్ట్రప‌తిగా ఎన్నికైతే దేశ చ‌రిత్రలో మొట్టమొదటి గిరిజన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించ‌నుంది. వ్యూహాత్మ‌కంగా ద్రౌప‌ది ముర్మును రాష్ట్రప‌తి రేసులోకి తీసుకువ‌చ్చిన భార‌తీయ జ‌న‌తా పార్టీ కూట‌మి ఎన్డీయే.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం కాషాయ పార్టీ ఇప్పుడు తన శ్రేణుల నుండి మరింత అనుభవజ్ఞుడైన అభ్య‌ర్థిని ఎంచుకునేదానిపై ఆస‌క్తి నెల‌కొంది. ఇదివ‌ర‌కు 2017లో అప్పటి బీహార్ గవర్నర్ దళితుడైన రామ్ నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి పోటీకి ఎంచుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచిన బీజేపీ.. ఆ త‌ర్వాత పార్టీ మాజీ అధ్యక్షుడు, రాజ‌కీయ అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్, అప్పటి కేబినెట్ మంత్రి ఎం వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపింది. 

దేశంలోని రెండు అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో త‌మ అభ్య‌ర్థుల‌ను కూర్చోబెట్టేందుకు బీజేపీ కూట‌మి వ్యూహాత్మ‌కంగా అడుగులేసి.. రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రప‌తిగా, వెంక‌య్య నాయుడును ఉప‌రాష్ట్రప‌తిగా సునాయాసంగా ఎన్నికల్లో గెలుపించుకుంది. ఈ సారి కూడా బీజేపీ ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో మ‌రోసారి జ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే తమ అభ్యర్థుల గెలుపును ఖాయం చేసుకునేందుకు బీజేపీ మళ్లీ బలమైన స్థితిలో ఉందని ప్ర‌స్తుతం ప‌రిణామాలు గ‌మ‌నిస్తే అర్థ‌మ‌వుతోంది. రాజ్యసభ చైర్‌పర్సన్‌గా ఉన్న తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను కలిగి ఉంటుంది. పార్లమెంటు ప్రస్తుత బలం 780లో బీజేపీకి 394 మంది ఎంపీలు ఉన్నారు. మెజారిటీ మార్క్ 390 కంటే ఎక్కువ. ప్ర‌స్తుతం రాష్ట్రప‌తిగా ఉన్న వెంక‌య్య నాయుడు ప‌ద‌వీకాలం ఆగ‌స్టు 10 తో ముగియ‌నుంది. ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ జూలై 19 కాగా, ఎన్నికలు ఆగస్టు 6న జరగనున్నాయి. 

ఈ క్ర‌మంలోనే బీజేపీ మ‌రోసారి దేశ అత్యున్నత‌ రెండు ప‌ద‌వుల్లో త‌మ అభ్య‌ర్థుల‌ను కూర్చోబెట్ట‌డానికి వ్యూహాత్మ‌క ప్ర‌య‌త్నాలు క‌చేస్తోంది. ఈ క్ర‌మంలోనే నేడు బీజేపీ పార్ల‌మెంట్ బోర్డ్ స‌మావేశం కానుది. పార్లమెంటరీ బోర్డు అనేది BJP అత్యున్నత సంస్థాగత సంస్థ. దాని సభ్యులలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు పార్టీ అధ్యక్షుడు JP నడ్డా, సీనియర్ నాయ‌కులు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగానే ప్రతిపక్షాలు కూడా పోటీకి బలవంతంగా తమ అభ్యర్థిని నిలబెడతాయనే సూచనల మధ్య.. బీజేపీ, జేడీ(యూ)లు త‌మ మిత్ర‌ప‌క్షాల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాయి. ఉప రాష్ట్రప‌తి ఎంపిక‌పై ఏకాభిప్రాయం తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.