ఎన్డీయే సమావేశానికి హాజరుకావాల్సిందిగా లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వానించారు . అయితే ఎన్డీయే సమావేశానికి వెళ్లాలా వద్దా అన్న దానిపై నేతలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. 

రానున్న ఎన్నికలకు సంబంధించి విపక్షాలు ఏకతాటిపైకి వస్తున్న నేపథ్యంలో బీజేపీ సైతం బల ప్రదర్శనకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఈ నెల 18న ఎన్డీఏ పక్షాల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ భేటీకి తన పాత మిత్రులైన శివసేన, శిరోమణి అకాలీదళ్, టీడీపీలను కూడా ఆహ్వానించాలని కమలనాథులు భావిస్తున్నారు. అలాగే ఎన్డీయేలోకానీ , యూపీఏలో కానీ లేని పార్టీలను కూడా పిలవాలని బీజేపీ భావిస్తోంది.

దీనిలో భాగంగా ఎన్డీయే సమావేశానికి హాజరుకావాల్సిందిగా లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వానించారు . ఎన్డీయేలో ఎల్‌జేపీ కీలకమైన ప్రాంతీయ పార్టీ అని.. పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో కీలక భాగస్వామి అని నడ్డా ఆ లేఖలో పేర్కొన్నారు. 2020లో బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు వ్యతిరేకంగా పోరాడేందుకు చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ పావుగా వాడింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో చిరాగ్ ఎన్డీయేకు దూరమయ్యారు. 

జేపీ నడ్డా రాసిన లేఖపై చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ.. పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము ఎప్పటికప్పుడు పలు అంశాలపై బీజేపీకి మద్ధతు ఇస్తున్నామన్నారు. అయితే ఎన్డీయే సమావేశానికి వెళ్లాలా వద్దా అన్న దానిపై నేతలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. 

ALso Read: విపక్షాలకు బీజేపీ కౌంటర్.. ఈ నెల 18న ఎన్డీయే పక్షాల సమావేశం, చంద్రబాబుకు ఆహ్వానం..?

దివంగత మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు వున్నాయంటూ వార్తలు జోరందుకున్నాయి. ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో చిరాగ్‌ ప్రాణాలకు ముప్పు వుందంటూ హెచ్చరించడంతో ఆయనకు వెంటనే జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం ఈ వార్తలకు బలం చేకూర్చినట్లయ్యింది. శుక్రవారం కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ చిరాగ్ పాశ్వాన్‌తో భేటీ అయ్యారు. ఇది వీరిద్దరి మధ్య వారంలో జరిగిన రెండో సమావేశం. 

ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వున్న చిరాగ్ మామ పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని ఎల్‌జేపీలో చీలక ఆయనను బలహీనపరిచింది. దీనికి తోడు చిరాగ్ పాశ్వాన్ పార్టీకి విధేయులైన వారి ఓటు బ్యాంక్‌ను నిలబెట్టుకోవడంలో విజయం సాధించి.. బీజేపీకి తన సత్తా ఏంటో చూపించారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, వామపక్షాలు వున్న కూటమిని ఢీకొట్టి చిరాగ్ నిలబడడ్డారు. అంతేకాదు.. జూనియర్ పాశ్వాన్ పలు అంశాల్లో బీజేపీకి అండగా నిలబడుతూ వచ్చారు.