Asianet News TeluguAsianet News Telugu

జార్ఖండ్ లో రాజ‌కీయ క‌ల‌క‌లం.. బీజేపీ ఎంపీలు దూబే, మనోజ్ తివారీపై కేసు న‌మోదు.. ఏం జ‌రిగిందంటే..? 

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా విమానం నడిపేందుకు సిబ్బందిపై ఒత్తిడి తీసుక‌వ‌చ్చినందుకు ఎంపీ నిషికాంత్ దూబే, ఎంపీ మనోజ్ తివారీ, బీజేపీ నేత కపిల్ మిశ్రా సహా తొమ్మిది మందిపై దియోఘర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎయిర్‌పోర్టు డీఎస్పీ సుమన్ ఫిర్యాదు మేర‌కు వారిపై కేసు న‌మోదు చేశారు. 
 

BJP MPs Nishikant Dubey, Manoj Tiwari among 9 booked for trespass at Deoghar airport
Author
First Published Sep 3, 2022, 11:12 AM IST

జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం నెల‌కొన్న వేళ‌..  బీజేపీ ఎంపీపై కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా బీజేపీ గొడ్డా ఎంపీ నిషికాంత్ దూబే, ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ, బీజేపీ నేత కపిల్ మిశ్రా సహా తొమ్మిది మందిపై దియోఘర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డియోఘర్ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిపై ఒత్తిడి చేసి నిబంధనలకు విరుద్ధంగా విమానం నడిపేందుకు ముగ్గురు నేతలు, వారి అటెండర్లు క్లియరెన్స్ తీసుకున్నారని, ఈ ఘ‌ట‌న‌ సమయంలో నిందితులందరూ అల్లకల్లోలం సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఏం జ‌రిగిందంటే.. 

ఆగస్ట్ 31న  ఏంపీ నిషికాంత్ దూబే, ఎంపీ మనోజ్ తివారీ, కపిల్ మిశ్రా సహా కొందరు దుమ్కా హత్యాకాండ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. ఈ సమయంలో ఎంపీ డియోఘర్ విమానాశ్రయంలో చార్టర్డ్ విమానం నుండి దిగారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందజేసి ఎంపీ సాయంత్రం 5.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని విమానం ఎక్కినా ఏటీసీ మాత్రం విమానాన్ని అనుమతించలేదు. అటువంటి పరిస్థితిలో వివాదం ఏర్పడింది. పైలట్‌తో సహా ఎంపీ దూబే, ఇతరులు ATC భవనంలోకి బలవంతంగా ప్రవేశించి ATC అధికారుల నుండి బలవంతంగా క్లియరెన్స్ తీసుకున్నారు. దీని తర్వాత అందరూ విమానం ఎక్కి ఢిల్లీ చేరుకున్నారు.

ఈ క్ర‌మంలో ఆ  ముగ్గురు బీజేపీ నేతలతో పాటు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సందీప్ ధింగ్రా, ముఖేష్ పాఠక్, దేవతా పాండే, పింటు తివారీ, చార్టర్డ్ విమాన పైలట్, ఎంపీ నిషికాంత్ దూబే ఇద్దరు కుమారుల‌పై కేసు న‌మోదయ్యింది.  డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ విమానయాన శాఖకు కూడా సమాచారం అందింది. మరోవైపు.. ఎంపీ నిషికాంత్ దూబే కూడా మెయిల్ ద్వారా స‌మాచారం అందించారు. 

డియోఘర్ ఎస్పీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని డియోఘర్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ సుమన్ అనన్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ సంఘటన  అనంత‌రం..  ఎంపీ దూబే, డియోఘర్ డిప్యూటీ కమీషనర్ మంజునాథ్ భజంత్రీల మధ్య తీవ్ర వాగ్వాదానికి నెల‌కొంది. ఈ అంశంపై జార్ఖండ్‌లోని క్యాబినెట్ కోఆర్డినేషన్ (సివిల్ ఏవియేషన్) ప్రిన్సిపల్ సెక్రటరీకి ఐఏఎస్ అధికారి లేఖ రాశారు. సద‌రు ఎంపీలు తన పనికి ఆటంకం కలిగించార‌ని ఆరోపిస్తూ ఎంపీ జిల్లా పోలీసు చీఫ్‌కు కూడా లేఖ రాశారు.

జులైలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ విమానాశ్రయం రాత్రిపూట రాకపోకలు సాగించేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. విమానాశ్రయంలో విమాన సేవలు ప్రస్తుతం సూర్యాస్తమయానికి అరగంట ముందు వరకు అనుమతించబడతాయి. జార్ఖండ్‌లో తీవ్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయంగా మారింది.

కాగా.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన వేళ‌.. (హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా , కాంగ్రెస్) ఆ రాష్ట్ర‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపణ‌లు వ‌స్తున్నాయి. అధికార పార్టీలోని మంత్రుల‌ను ఎక్క‌డ బీజేపీ లాక్కుంటుందోన‌ని.. గత రెండు వారాలుగా JMM, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించారు.   

మంత్రుల‌ను వివిధ రాష్ట్రాల‌కు తిపుతూ.. రిసార్ట్  రాజ‌కీయాల‌ను చేస్తున్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరగాలని డిమాండ్ చేసిన జార్ఖండ్‌ బిజెపి నేత‌ల్లో గొడ్డా ఎంపి నిషికాంత్ దూబే కూడా ఉన్నారు. జార్జండ్ రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న నేప‌థ్యంలో ఇలా బీజేపీ నేత‌ల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు కావ‌డం చ‌ర్చ‌నీయంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios