ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ సమర్థతపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టినట్టు కేసులు రావడం ఆందోళన రేపుతోంది.

ఈ నేపథ్యంలో యూరోప్‌లోని పలు దేశాలు ఆ వ్యాక్సిన్ వాడకాన్ని నిలుపుదల చేశాయి. ఈ క్రమంలో ఆస్ట్రాజెనెకాపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను యూరోపియన్ దేశాలు నిలిపివేసినట్టు కథనాలు వస్తున్నాయని చెప్పారు. ఇదే వ్యాక్సిన్‌ను మన దగ్గర కోవిషీల్డ్‌గా వాడుతున్నామని స్వామి అన్నారు. ఈ విషయం గురించి మన కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టి సారించిందా? అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

కాగా, యాంటీ-కోవిడ్ డోసు అందుకున్న 49 రోజుల తర్వాత ఒక నర్సు ‘తీవ్రమైన రక్తం గడ్డకట్టిన సమస్యతో’ మరణించిన తరువాత ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల వాడకాన్ని నిలిపివేసినట్లు ఆస్ట్రియా ప్రకటించింది.

ఇదే బాటలో మరో నాలుగు యూరోపియన్ దేశాలైన ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్ కూడా తదుపరి బ్యాచ్ నుంచి వ్యాక్సిన్ల వాడకాన్ని నిలిపివేశాయి. ఆస్ట్రాజెనెకా 17 యూరోపియన్ దేశాలకు మిలియన్‌ డోసులకు పైగా పంపిణీ చేసింది.