‘‘సనాతన’’ను వ్యతిరేకించడానికే ఇండియా కూటమి.. డీఎంకే మంత్రి పొన్ముడి వ్యాఖ్యలు, కౌంటరిచ్చిన రవిశంకర్ ప్రసాద్
డీఎంకే నేత, తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి కే.పొన్ముడి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడమే వారి హిడెన్ ఎజెండా అని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.

డీఎంకే నేత, తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి కే.పొన్ముడి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్. ‘‘క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్’’ అని ఆంగ్లంలో ఒక సామెత వుందని ఆయన చురకలంటించారు. వాళ్లు అనుకున్నది తేలిపోయిందని.. సనాతన ధర్మాన్ని ఎదిరించి అంతం చేసేందుకు ఇండియా కూటమి ఏర్పడిందని రవిశంకర్ మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన సీఎం స్టాలిన్ కుమారుడు ఎయిడ్స్ కంటే దారుణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడమే వారి హిడెన్ ఎజెండా అని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
ఇతర మతాల దేవతలను విమర్శించే హక్కు వారికి వుందా అని కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని తాను అడగదలచుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఇతర మతాల గురించి మౌనంగా వుంటారని.. కానీ సనాతన సంస్థలను బహిరంగంగా వ్యతిరేకిస్తారని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. ఈ వివాదంపై ఇప్పటి వరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నోరు మెదపకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
నిన్న (సెప్టెంబర్ 11)న వైరల్ అయిన వీడియో క్లిప్‌లో.. తమిళనాడు మంత్రి పొన్ముడి మాట్లాడుతూ పత్రికల ద్వారా, మీడియా ద్వారా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాలన్నదే మా సిద్ధాంతమన్నారు. ఇండియా కూటమిలో వున్న తమ స్నేహితులందరూ ఇదే చెప్పారు. సనాతనను వ్యతిరేకించేందుకు ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. పార్టీలకు భిన్నాభిప్రాయాలు వుండవచ్చు కానీ.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవన్నారు.
సమానత్వం నెలకొల్పడం, మైనారిటీలను రక్షించడం, స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని కాపాడటం వంటి వాటికి కూటమిలోని వారంతా మద్ధతు ఇస్తున్నారని పొన్మడి అన్నారు. ఈ విషయాలపై సామాజిక స్పృహ కల్పించడమే 26 పార్టీలు కలిసి ఏర్పడిన ఇండియా కూటమి ఉద్దేశ్యమన్నారు. ఇక్కడ వచ్చిన మీరంతా కాన్ఫరెన్స్‌లో ఏం చేసినా రాజకీయాల్లో గెలిచినప్పుడే ఈ పని చేయగలుగుతారని పొన్మడి అన్నారు.