ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై బీజేపీ ఎంపీ పర్వేష్ సింగ్ సాహేబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

బీజేపీ ఎంపీ పర్వేష్ సింగ్ సాహేబ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం ఫ్యామిలీ వుందన్నారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ రూమ్‌లో ఎక్సైజ్ పాలసీ రూపొందించారన్న ఆయన.. ఎక్సైజ్ కమీషనర్, ఢిల్లీ ఢిప్యూటీ సీఎం, లిక్కర్ మాఫియా, ఎక్సైజ్ అధికారులు , కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా హోటల్ రూమ్ డీల్‌లో వున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ విమానంలో వచ్చే వారని, ఇది తెలంగాణ రాష్ట్రంలోని మద్యం మాఫియాకు చెందిన ఒక వ్యక్తి ఏర్పాటు చేసిన విమానమని సాహేబ్ చెప్పారు. ఆయనే ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో ఒక సూట్ రూమ్ బుక్ చేశారని పర్వేష్ సింగ్ ఆరోపించారు. 

కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఢిల్లీ ఎల్ 1 లైసెన్స్ హొల్డర్లు లిక్కర్ పాలసీ రూపొందించారని ఆయన వ్యాఖ్యానించారు. మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.150 కోట్లు ఇచ్చారని.. తెలంగాణ నుంచి వచ్చినవారే ఈ రూ.150 కోట్లు ఇచ్చారని పర్వేష్ సింగ్ ఆరోపించారు. తెలంగాణ కుటుంబ సభ్యులతో మీరు సమావేశం అయ్యారా అని ఆయన ప్రశ్నించారు. మనీష్ సిసోడియా సమాధానం చెప్పాలని పర్వేష్ సింగ్ నిలదీశారు.