పార్లమెంట్ పాత భవనం వద్ద ఫొటో సెషన్.. స్పృహతప్పి పడిపోయిన బీజేపీ ఎంపీ నరహరి..
పార్లమెంట్ నూతన భవనంలో నేటి నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పాత పార్లమెంట్ భవనం వద్ద ఈరోజు ఫొటో సెషన్ కార్యక్రమం నిర్వహించారు.

పార్లమెంట్ నూతన భవనంలో నేటి నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పాత పార్లమెంట్ భవనం వద్ద ఈరోజు ఫొటో సెషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే పార్లమెంటు సభ్యుల గ్రూప్ ఫొటో సెషన్‌లో బీజేపీ ఎంపీ నరహరి అమీన్ స్పృహతప్పి పడిపోయారు. దీంతో అక్కడున్నవారిలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
దీంతో సహచర ఎంపీలతో పాటు కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, అమిత్ షా, పీయూష్ గోయల్ వెంటనే అక్కడికి పరుగులు తీశారు. ఆయనకు తోటి ఎంపీలు నీళ్లు అందించారు. అయితే ఎంపీ నరహరి అమీన్ ప్రస్తుతం కోలుకున్నారని, బాగానే ఉన్నారని.. ఫొటో సెషన్‌లో కూడా పాల్గొన్నారని సమాచారం.
ఇదిలాఉంటే,పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీనియర్ పార్లమెంటేరియన్‌లుగా ప్రసంగించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, జేఎంఎం నేత శిబు సోరెన్, బీజేపీ ఎంపీ మేనకా గాంధీలకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ రాజ్యాంగ ప్రతిని తీసుకుని కొత్త పార్లమెంట్ హౌస్‌కి నడుస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంపీలందరూ కాలినడకన ఆయనను అనుసరించనున్నారు. తరువాత కొత్త పార్లమెంట్‌లోని వారి వారి ఛాంబర్‌లలో సమావేశమవుతారు.