ప్రజలను ‘‘ప్రత్యేకంగా’’ దగా చేస్తున్నారు.. హోదాపై చెప్పేవన్నీ అబద్ధాలే: జీవీఎల్

bjp MP GVL narasimharao fires on TDP
Highlights

ప్రత్యేకహోదా పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రత్యేకంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

ప్రత్యేకహోదా పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రత్యేకంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. విభజన చట్టం అమలు, ప్రత్యేకహోదా అంశాలపై రాజ్యసభలో చర్చ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా వస్తే 100 రకాలుగా రాయితీలు వస్తాయని కొన్ని పార్టీలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.

జమ్మూకశ్మీర్‌కు కూడా ఆ రాయితీ లేదని.. ఉత్తరాఖండ్‌, హిమాచల్ ప్రదేశ్‌లకు కూడా ఆ బెనిఫిట్స్ లేవని కేవలం 2003 నుంచి 2013 వరకు మాత్రమే ఆయా బెనిఫిట్స్ ఉండేవని జీవీఎల్ అన్నారు. 2014 తర్వాత ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేకహోదా లేదని తాను చెప్పినప్పుుడు ఆనంద్ శర్మ కూడా అంగీకరించారని నరసింహారావు గుర్తు చేశారు. ప్రత్యేకహోదా విషయంలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చాలా స్పష్టంగా పేర్కొన్నారన్నారు.

ఇప్పటి వరకు రూ.22వేల కోట్ల రెవెన్యూ లోటును అందజేశామని.. ప్రత్యేకహోదా ఇచ్చుంటే దానిలో రూ.15 వేల కోట్లు వచ్చేవి కావని ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారని జీవీఎల్ గుర్తు చేశారు.. ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా అదనంగా మరో రూ.15 వేల కోట్లు లాభం చేకూరేలా తాము చేశామన్నారు. తెలుగు ప్రజల పట్ల, ఏపీ ప్రజల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉందన్నారు. చట్టంలోని లేని అనేక హామీలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు అమలు చేశామన్నారు.

ఇంత చెప్పిన తర్వాత కూడా టీడీపీ నేతలు తిరిగి అదే ప్రశ్న అడుగుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ చౌదరి సినిమా మాదిరిగా తమ వాదనను మార్చుకున్నారని జీవీఎల్ అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అనేక రకాలుగా సాయం చేసిందని తెలుగు ప్రజలను తాము మోసం చేయమని తెలిపారు. విభజనతో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సరైన రాజకీయ నాయకత్వం కావాలని.. ఆ విజ్ఞత ఉన్నప్పటికీ కేవలం రాజకీయ లాభాల కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని నరసింహారావు ధ్వజమెత్తారు.
 

loader