ఉత్తరప్రదేశ్: శిలాఫలకంలోని పేర్ల అంశం ఓ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య గొడవకు దారి తీసింది. మాటలతో ప్రారంభమై వాగ్వాదానికి దారి తీసింది. అనంతరం ఒక్కసారిగా విచక్షణ కోల్పోయిన ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు బూట్లతో దాడికి పాల్పడ్డారు. 

వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ సంత్‌ కబీర్ నగర్ లోని ఓ సమావేశంలో బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ లు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిపై జరుగుతున్న సమావేశంలో శిలాఫలకంలోని పేర్లు, ప్రోటోకాల్ పై ఇరు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

వాగ్వాదం కాస్త గొడవకు దారితియ్యడంతో నేతలు బూట్లతో కొట్టుకున్నారు. ఇద్దరికీ సర్ది చెప్పేందుకు మంత్రితోపాటు ఇతర నేతలు, జిల్లా అధికారులు ప్రయత్నించారు. అయినా ఇద్దరు వెనక్కి తగ్గకకుండా ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. 

పోలీస్ అధికారులు వచ్చి ఇద్దరు నేతలనూ శాంతింప చెయ్యడంతో గొడవ సర్దుమణిగింది. మరోవైపు ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. అటు ఘటనపై బీజేపీ యూపీ విభాగం కన్నెర్ర చేసింది. 

ఇద్దరు నేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మంత్రి సాక్షిగా ఈ వ్యవహారం జరగడంతో అంతా నివ్వెరపోయారు. అటు మహిళా అధికారులైతే పరుగులతో బయటకు వెళ్లిపోయారు.