కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ బ్రిట‌న్ వేదిక‌గా మ‌రోసారి బీజేపీ, మోదీ స‌ర్కార్‌ పై మండిపడ్డారు. బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని నమ్ముతుందని అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీని, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎప్పటికీ అధికారంలో ఉంటుందని విశ్వసిస్తున్నదని, అది అలా జరగడం అసంభవమని, కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాదనడం హాస్యాస్పదమైన ఆలోచన అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ తన వారం రోజుల UK పర్యటనలో చివరి రోజైన సోమవారం సాయంత్రం చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్‌లో ఇంటరాక్టివ్ సెషన్‌లో ప్రసంగించారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ప్రభుత్వ వైఫల్యానికి గల కారణాలను కూడా వివరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ పదేళ్లు అధికారంలో ఉండక ముందు కాంగ్రెసే అధికారంలో ఉందని అన్నారు. బీజేపీ భారతదేశంలో అధికారంలోకి వచ్చిందని, ఎప్పటికీ అధికారంలో ఉంటుందని భావించడం సరికాదని అన్నారు. బీజేపీ దేశంలో కొత్త సిద్ధాంతం అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు. జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, వారిపై దాడులు చేస్తున్నారన్నారు.

గత తొమ్మిదేండ్లుగా జ‌ర్నలిస్టుల‌పై దాడులు, అణిచివేత జరుగుతున్నాయని ఆందోళ‌న వ్యక్తం చేశారు. ఇటీవ‌ల బీబీసీ కార్యాల‌యాల‌పై జ‌రిగిన ఐటీ సోదాల‌ను ప్రస్తావించారు. భారత్ లోని దళితులు, బలహీన సామాజిక వర్గాల ప్రజలు నోరెత్తకూడదని బీజేపీ భావిస్తోందని, దేశ సంపదనంతా నలుగురైదుగురికి పంచాలని ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.

రాహుల్‌పై విరుచుకపడ్డ బీజేపీ

మరోవైపు రాహుల్ గాంధీ దాడులపై భారతీయ జనతా పార్టీ కూడా స్పందించింది. రాహుల్ గాంధీ చైనాను పొగుడుతూనే విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారని బీజేపీ ఆరోపించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం మాట్లాడుతూ.. భారతదేశానికి ద్రోహం చేయవద్దు, రాహుల్ గాంధీ జీ. భారతదేశ విదేశాంగ విధానంపై వచ్చిన అభ్యంతరాలు ఈ సమస్యపై మీకున్న అవగాహన సరిగా లేకపోవడానికి నిదర్శనం. మీరు భారతదేశం గురించి విదేశీ నేల నుండి ప్రచారం చేశారనే అబద్ధాన్ని ఎవరూ నమ్మరు. తన వైఫల్యాలను దాచిపెట్టే కుట్రలో భాగంగా రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత్ పరువు తీసే పనికి పూనుకున్నారని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.