Gyanvapi row: జ్ఞాన్‌వాపీ వివాదంపై బీహార్ మంత్రి, బీజేపీ నేత రామ్‌సూరత్ రాయ్ తన వ్యాఖ్యతో వివాదం రేపారు. దేవుళ్లను మోసం చేసి ముస్లింలు దేవాలయాలను లాక్కున్నారని ఆరోపించారు. దేవుడికి టోపీ పెట్టి భూమిని కూడా లాక్కున్నారని, ఇప్పుడు గుడిపై ఎక్కడ మసీదు కట్టినా ప్రజలు దాన్ని ఖాళీ చేస్తారని అన్నారు. 

Gyanvapi row: దేశ‌వ్యాప్తంగా జ్ఞానవాపి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బీహార్ మంత్రి, బీజేపీ నేత రామ్ సూరత్ రాయ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ముస్లింలు దేవుడిని మోసం చేసి హిందువులకు చెందిన అన్ని దేవాలయాలను లాక్కున్నారని సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జాముయ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి రామ్‌సూరత్‌ రాయ్‌ మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివ‌రించారు. ఈ సమ‌యంలో జ్ఞాన‌వాపి వివాదంపై ప్ర‌శ్నించ‌గా.. సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. 

ముస్లింల ఇంటికి వెళ్లినప్పుడు.. హిందువులకు ఇస్లామిక్ టోపీ పెట్టి ఎలా స్వాగతం పలుకుతారో.. అదే విధంగా.. దేవుళ్ల‌కు కూడా టోపీ పెట్టి భూమిని కూడా లాక్కున్నారని మంత్రి రామ్ సూరత్ రాయ్ అన్నారు. ముస్లింలు దేవుళ్లను మోసం చేశారని, దేవాలయాలన్నింటిని లాక్కుని మసీదులను నిర్మించారని అన్నారు. హిందూ దేవుళ్లు.. కృష్ణ రూపంలోనో, శివుని రూపంలోనో, రాముని రూపంలోనో క‌నిపిస్తున్నాడ‌ని, గుడిపై ఎక్కడ మసీదు కట్టినా ప్రజలు ఇప్పుడు దాన్ని ఖాళీ చేస్తార‌ని, కానీ పూర్వీకులు విడిచిపెట్టార‌ని అన్నారు. గతంలో మొఘల్ పాలకులు ఆలయంలో మసీదు నిర్మించి ఆలయ భూమిని లాక్కోవడం సరికాదన్నారు. హిందూ మతం సంస్కృతిలో భాగమైనందున, వారి స్వంత భూమిని వదులుకోవలసి ఉంటుందని మంత్రి రామ్ సూరత్ రాయ్ అన్నారు. అయితే జ్ఞానవాపిపై కోర్టు తీర్పు చెల్లుబాటవుతుందని మంత్రి తెలిపారు. 

అలాగే..జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న‌ హత్యలపై మంత్రి రామ్ సూరత్ రాయ్ మాట్లాడుతూ.. ఎవరైనా మన వాళ్లలో ఒకరిని చంపితే, 100 మంది చనిపోతారని హెచ్చ‌రించారు. బీజేపీ పాల‌న‌లో జమ్మూకశ్మీర్‌లో 70 ఏళ్ల వ్యాధి అంత‌మైంద‌ని, ఏడాది, రెండేళ్లుగా అక్క‌డి చెత్తను తొలగిస్తున్నారని, అక్కడి వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించే వారికి తగిన సమాధానం చెప్పుతామ‌ని అన్నారు. మా వాళ్లలో ఒకరిని చంపితే.. వాళ్లలో 100 మంది చనిపోతారని వివాదాస్ప‌ద వ్యాఖ్యాలు చేశారు.

అదే సమయంలో అక్రమణల ప్రశ్నపై మంత్రి మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌ తరహాలో బీహార్‌లోనూ బుల్‌డోజర్లు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించినా త్వరలోనే విముక్తి చేస్తామన్నారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదు. ప్రభుత్వ భూమిని విడిపించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామన్నారు.