మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేని దేశభక్తుడిగా అభివర్ణించిన బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ క్షమాపణలు చెప్పారు. గాడ్సేను దేశభక్తుడన్న ఆమె వ్యాఖ్యలపై రాజకీయంగా పెద్ద దుమారం రేగింది.

దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు సాధ్వీ వ్యాఖ్యలను ఖండించారు. దీనికి తోడు ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని బీజేపీ ప్రకటించడంతో ఆమె వెనక్కి తగ్గి దేశప్రజలకు క్షమాపణలు తెలిపారు.

కాగా, గాంధీని చంపిన గాడ్సే స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ టెర్రరిస్టు అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు సాధ్వి స్పందించారు. గాడ్సే దేశ భక్తున్న ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపడంతో బీజేపీ రంగంలోకి దిగింది.

ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగతమని.. సాధ్వి వ్యాఖ్యలను పార్టీ ఖండిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. దీనికి తోడు గాంధీని చంపిన గాడ్సే ఎన్నడూ దేశభక్తుడు కాలేడని మధ్యప్రదేశ్ బీజేపీ నేత లోకేంద్ర పరాశర్ తెలిపారు.