Asianet News TeluguAsianet News Telugu

బ్రాహ్మణులు, బనియాలు నా జేబులో ఉన్నారు.. బీజేపీ నేత మురళీధర్ రావు వ్యాఖ్యలపై వివాదం

బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు (Muralidhar Rao)  చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. బ్రాహ్మణ, బనియాలు (Brahmins, Baniyas) తమ జేబులోని వ్యక్తులని మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఎదురుదాడి ప్రారంభించింది. మురళీధర్ రావు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

BJP Leader Muralidhar Rao Says Brahmins Baniyas Are In His Pockets
Author
Bhopal, First Published Nov 9, 2021, 9:44 AM IST

బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు (Muralidhar Rao)  చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. బ్రాహ్మణ, బనియాలు (Brahmins, Baniyas) తమ జేబులోని వ్యక్తులని మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) బీజేపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మురళీధర్ రావు సోమవారం భోపాల్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఎదురుదాడి ప్రారంభించింది. మురళీధర్ రావు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే తన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంపై స్పందించిన మురళీధర్ రావు.. ప్రతిపక్ష పార్టీ తన ప్రకటను వక్రీకరించిందని పేర్కొన్నారు. 

భోపాల్‌లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మురళీధర్‌ రావు మాట్లాడుతూ.. ‘బీజేపీ, బీజేపీ పాలిత ప్రభుత్వాలు షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాయని.. వారి ఓటు బ్యాంకు గురించి కాకుండా.. వెనకబాటుతనం, ఉపాధి, విద్య వంటి సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే’ అని పేర్కొన్నారు. 

Also read: Lakhimpur Kheri ఘటన విచారణ తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి.. హైకోర్టు మాజీ న్యాయమూర్తిని పర్యవేక్షించనివ్వండి

ఈ క్రమంలోనే పలువురు జర్నలిస్టులు.. ‘బీజేపీ అనేది బ్రాహ్మణలు, బనియాల పార్టీ అనే మాట వినిపిస్తుంది. బీజీపీ నినాదం వచ్చేసి సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. అలాంటప్పుడు మీరు ఎస్సీ, ఎస్టీలపై ప్రత్యేక దృష్టి పెట్టడం గురించి మాట్లాడుతున్నారు’ అని మురళీధర్‌ రావును అడిగారు. దీనికి బదులిచ్చిన ఆయన.. తన కుర్తా జేబుల వైపు చూపిస్తూ.. ‘నా జేబుల్లో బ్రాహ్మణులు, బనియాలు ఉన్నారు. పార్టీలోని చాలా మంది కార్యకర్తలు, ఓటు బ్యాంకు ఈ వర్గాలకు చెందిన వారు ఉండటంతో మీరు(మీడియా) మమ్మల్ని బ్రాహ్మణ, బనియా పార్టీ అని అంటున్నారు’ అని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల విశ్వాసాన్ని పొందేందుకు బీజేపీ కృషి చేస్తోందని తెలిపారు.

‘కొన్ని వర్గాలకు చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు పార్టీ వారిదే అని చెప్పేవారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తక్కువ ప్రాతినిధ్యం ఉండటం గుర్తించి.. మరింత మందిని చేర్చుకోవడానికి మేము కృషి చేస్తున్నాం. మేము అన్ని వర్గాలతో ముందుకు వెళ్తాం.. బీజేపీని ప్రతి వర్గానికి చెందిన పార్టీగా మారుస్తాం. మేము బ్రహ్మణులు, బనియాలతో పాటు ఏ వర్గాన్ని వదలడం లేదని.. తక్కువగా ఉన్నవారిని మరింతగా చేర్చుకుంటాం. నిజమైన జాతీయ పార్టీ భావన మాది’అని చెప్పారు. 

అయితే బ్రాహ్మణులు, బనియాల గురించి మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన 6 సెకన్ల వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ సబ్‌‌కా సాథ్.. సబ్‌కా వికాస్ నినాదం చెబుతోందని.. కానీ ఆ పార్టీ నేత మాత్రం బ్రాహ్మణులు, బనియాలు తమ జేబుల్లో ఉన్నారని మాట్లాడతారని విమర్శించారు. వారిపై బీజేపీ హక్కును ప్రదర్శించడం.. ఆ వర్గాలను అవమనించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ  నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన ఈ వర్గాలకు ఎలాంటి గౌరవం ఇస్తారని ప్రశ్నించారు. అధికారం చేతుల్లో ఉండటంతో బీజేపీ నేతలు దురహంకారం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆ వర్గాలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని కమల్‌నాథ్ డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios