ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ నేత కూతురు ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నది. ఈ పెళ్లికి సంబంధించిన కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందుత్వ హార్డ్‌లైనర్లు మండిపడుతున్నారు. ఈ పెళ్లికి ఆ బీజేపీ నేత తన పార్టీ నేతలను, కాంగ్రెస్ పార్టీ నేతలను ఆహ్వానించడం గమనార్హం.
న్యూఢిల్లీ: ఓ బీజేపీ నేత కూతురు ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నది. ఉత్తరాఖండ్‌లోని పౌరీ ఏరియాకు చెందిన బీజేపీ నేత యశ్‌పాల్ బెనాం కూతురు వధువు. వీరి పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వెడ్డింగ్ కార్డు వైరల్ అయింది. పలువురు మంది ఈ పెళ్లిని ప్రశ్నించారు. బీజేపీ నేత అయి ఉండి.. బిడ్డను వేరే మతానికి చెందిన యువకుడిని ఇచ్చి పెళ్లి చేయడం ఎలా సమర్థనీయం అంటూ ప్రశ్నలు కురిపించారు. యశ్‌పాల్ బెనాంపై విమర్శలు చేశారు.
హిందుత్వ హార్డ్‌లైనర్లు మాజీ ఎమ్మెల్యే యశ్‌పాల్ బెనాంపై ట్రోలింగ్ చేశారు. డబుల్ స్టాండర్డ్స్ అంటూ ఆరోపించారు. లవ్ జిహాద్‌కు ఒక ప్రయత్నమని అన్నారు. ఇటీవలే విడుదలైన సినిమా కేరళ స్టోరీస్‌తో వీరి స్టోరీని పోల్చారు.
ది కేరళ స్టోరీ సినిమాకు బీజేపీ రాష్ట్రాలు పన్ను నుంచి మినహాయింపులు ఇచ్చాయి. కాగా, ఇక్కడ బీజేపీ నేత మాత్రం తన బిడ్డను ముస్లిం వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఇది కచ్చితంగా ద్వంద్వ వైఖరే అవుతుంది. ఇలాంటి ఉదంతాలతో బీజేపీ కార్యకర్తలు డైలమాలో పడుతారని ఓ ఫేస్‌బుక్ యూజర్ పేర్కొన్నాడు.
పౌరి టెంపుల్ కమిటీ అధికారులు ఇండియా టుడేతో ఈ ఘటనపై మాట్లాడారు. ఇది ఆందోళనకర పరిణామం అని తెలిపారు. హిందూ ఆడ బిడ్డలను వేరే మతాల్లోకి పంపించడం కచ్చితంగా దుష్ప్రచారంలో భాగమే అని వివరించారు. మత మార్పిడిలపై ఉన్న చట్టాలను మెల్లిగా వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇతర మతాల వారు వారి కోసం వారు సమాధులను ప్రభుత్వ భూములపై నిర్మిస్తున్నారని అన్నారు. వాటిని కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నదని వివరించారు. అయినా.. ఇప్పటికీ బీజేపీ నేతలు వారి కూతుళ్లనే ముస్లిం వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు, విశ్వ హిందు పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు దీన్ని వ్యతిరేకించాలని పేర్కొన్నారు.
హిందువులను కాపాడేది బీజేపీ అని, ఆ పార్టీ వెంటనే ఇలాంటి నేతలను బహిష్కరించాలని వివరించారు.
Also Read: మర్మాంగాన్ని చూపిస్తూ వెకిలిచేష్టలు... కేరళ యువతిపై ఆకతాయి లైంగిక వేధింపులు
యశ్‌పాల్ బెనాంకు సన్నిహితంగా ఉండే కొందరు మాట్లాడుతూ, ఆయన కూతురు లక్నో యూనివర్సిటీలో చదువుకున్నదని చెప్పారు. అదే సమయంలో అక్కడే చదువుతున్న వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, ఆయనతోనే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటున్నదని వివరించారు.
ఈ నెల 28వ తేదీన పౌరిలోని రిసార్ట్‌లో వారి పెళ్లి జరగబోతున్నది. పౌరి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రస్తుతం బెనామ్ ఉన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్‌లోనూ ఉన్నారు. 2007 పౌరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్రంగా గెలిచారు.
యశ్‌పాల్ బెనాం తన బిడ్డ పెళ్లికి బీజేపీ, కాంగ్రెస్ నేతలనూ ఆహ్వానించారు.
