బస్సులో వెళుతున్న యువతి పక్కసీట్లో కూర్చున్న ఓ నీచుడు మర్మాంగాన్ని చూపిస్తూ వేధించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది.
కొచ్చి : అమ్మాయి ఒంటరిగా కనిపించిందంటే చాలు కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. వెకిలి చేష్టలతో మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఇలా తాజాగా కేరళ యువతితో ఒకడు నీచంగా వ్యవహరించగా ధైర్యంగా అతడిని ఎదిరించి పోలీసులకు అప్పగించింది.
కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన యువతి బస్సులో వెళుతుండగా పక్కసీటు ఖాళీగా వుండటంతో సయ్యద్ అనే యువకుడు కూర్చున్నాడు. అమ్మాయి పక్కన కూర్చోవడంతో అతడిలోని కామాంధుడు బయటకువచ్చాడు. యువతిని అసభ్యంగా తాకడంతో పాటు మర్మాంగాన్ని బయటపెట్టి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో నివ్వెరపోయిన యువతి ధైర్యంగా నీచుడిని ఎదిరించింది.
సయ్యద్ అసభ్య ప్రవర్తనను తన సెల్ ఫోన్ లో వీడియో తీసింది. ఇది గమనించిన అతడు బస్సు దిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ కండక్టర్ సాయంతో వాడిని పట్టుకున్న యువతి పోలీసులకు అప్పగించింది. అతడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బస్సులో తనకు ఎదురైన అనుభవాన్ని యువతి సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. సయ్యద్ వెకిలిచేష్టలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఒంటరి యువతిపై లైంగిక వేధింపులకు దిగిన సయ్యద్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
