తరచూ కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా వాటి తీవ్రత పెంచారు. మహారాష్ట్ర రాజధాని ముంబైని బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తను అవగాహన లేక ఇలా మాట్లాడటం లేదని, పూర్తి బాధ్యతతో చెబుతున్నానని అన్నారు.  

ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని శివ‌సేన సీనియ‌ర్ నాయ‌కుడు, ఎంపీ సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ విష‌యంలో త‌న వ‌ద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య, ఆ పార్టీ నాయ‌కులు, బిల్డర్లు, వ్యాపారవేత్తల బృందం ఈ కుట్రలో భాగమని ఆరోపించారు.

“ ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా చేసే విష‌యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఈ బృందం ప్రెజెంటేష‌న్ ఇచ్చింది. దీని కోసం సమావేశాలు నిర్వహించి నిధులు సేకరిస్తున్నారు. గత రెండు నెలలుగా ఇదే జరుగుతోంది. ఇది నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నాను. నేను చెప్పేది నిరూపించడానికి నా దగ్గర రుజువులు ఉన్నాయి. ఈ పరిణామం ముఖ్యమంత్రి (ఉద్ధవ్ థాకరే)కి కూడా తెలుసు” అని సంజ‌య్ రౌత్ అన్నారు. 

మహారాష్ట్ర రాజధాని ముంబైలో మరాఠీల శాతం బాగా తగ్గిపోయిందని, అందుకే నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుతూ సోమయ్య నేతృత్వంలోని బృందం మరికొద్ది నెలల్లో కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంద‌ని శివసేన ఎంపీ సంజ‌య్ రౌత్ అన్నారు. పాఠశాలల్లో మరాఠీని తప్పనిసరి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సోమయ్య గతంలో సవాలు చేశారని రౌత్ గుర్తు చేశారు. 

గతంలో కూడా సంజయ్ రౌత్ బీజేపీపై తీవ్రంగా ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప‌డగొట్టాల‌ని ఈడీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని అన్నారు. దానికి సహకరించనందుకే తనను ఈడీ వేధిస్తోంద‌ని గ‌త నెల‌లో చెప్పారు. ఈ విష‌యంలో ఆయ‌న ఉప రాష్ట్రప్ర‌తి వెంక‌య్య నాయుడుకి లేఖ రాశారు. ఈడీ (ED) ఇతర దర్యాప్తు సంస్థ అధికారులు ఇప్పుడు రాజకీయ యజమానులకు తోలు బొమ్మలుగా మారార‌ని అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలను తీసుకువ‌చ్చేలా ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోతే జైలు శిక్ష విధిస్తామని ఆ అధికారులు తనను బెదిరించార‌ని సంజ‌య్ రౌత్ ఆరోపించారు. 

ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడికి సంజయ్ రౌత్ రాసిన లేఖ‌లో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘ సుమారు ఒక నెల క్రితం కొంతమంది వ్యక్తులు నన్ను సంప్రదించారు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడంలో వారికి సహాయం చేయలని చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలను తీసుకురావాలని, ఆ ప్ర‌యత్నాల్లో నేను కీల‌కంగా ఉండాల‌ని వారు కోరారు. నేను దానికి నిరాకరించాను. ఈ తిరస్కరణకు నేను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని వారు హెచ్చ‌రించారు. ఓ మాజీ కేంద్ర మంత్రికి ప‌ట్టిన గ‌తే నాకు ప‌డుతుంద‌ని తెలిపారు. నేనే కాకుండా మహారాష్ట్ర కేబినెట్‌లోని మరో ఇద్దరు సీనియర్ మంత్రులతో పాటు మ‌రో ఇద్దరు సీనియర్ నేతలను కూడా పీఎంఎల్‌ఏ చట్టం కింద కటకటాల వెనక్కి పంపుతామని చెప్పారు. ఇది మధ్యంతర కాలానికి దారి తీస్తుందని హెచ్చరించింది. రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా కటకటాల వెనుకే ఉన్న స‌మ‌యంలో మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతాయి’’ అని వారు తెలిపారని అన్నారు. కాగా ఈ మంగళవారం తెల్లవారుజామున మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సంజయ్ రౌత్, అతని కుటుంబానికి చెందిన అలీబాగ్‌లోని ఆస్తుల‌తో పాటు ముంబ‌యిలోని దాదర్ శివారులోని ఒక ఫ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది.