బీజేపీ ఒక గద్దర్ పార్టీ.. ఎన్ఆర్సీ అమలును అనుమతించబోము - ఈద్ నమాజ్ లో మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీని ‘గద్దర్ పార్టీ’ అంటూ అభివర్ణించారు. ఆ పార్టీతో, కేంద్ర ఏజెన్సీలతో తాను పోరాడాల్సి ఉందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్ ఆర్సీని అమలు చేయనివ్వబోమని తెలిపారు.
విద్వేష రాజకీయాలతో దేశాన్ని చీల్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాను ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నానని, కానీ దేశ విభజనను అనుమతించబోనని తృణమూల్ కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు. కోల్ కతాలోని రెడ్ రోడ్ లో ఈద్ నమాజ్ సందర్భంగా జరిగిన సభలో మమతా బెనర్జీ ప్రసంగించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో మితవాద బీజేపీ పార్టీని ఓడించేందుకు ప్రజలంతా ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కేవలం రెండు స్థానాల్లోనే ఎంఐఎం పోటీ.. ఎందుకంటే ?
బెంగాల్ లో శాంతి నెలకొనాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. తమకు అల్లర్లు వద్దని, దేశంలో విభజనలను తాము కోరుకోవడం లేదని చెప్పారు. ‘‘ దేశంలో చీలికలు సృష్టించాలనుకునే వారు - ఈద్ సందర్భంగా నేను ఈ రోజు వాగ్దానం చేస్తున్నాను, నేను నా ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ దేశాన్ని విభజించడానికి నేను అనుమతించను’’ అని మమతా బెనర్జీ అన్నారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది.
అస్సాంలో భీకర తుఫాను.. దెబ్బతిన్న 400 నివాసాలు.. ఇళ్లు కూలడంతో ఏడేళ్ల మృతి..
కాషాయ శిబిరం దేశ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించిన మమతా బెనర్జీ.. పశ్చిమ బెంగాల్ లో ఎన్ ఆర్సీ అమలును తమ ప్రభుత్వం అనుమతించబోదని తేల్చి చెప్పారు. ‘‘నేను మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే. ప్రశాంతంగా ఉండండి, ఎవరి మాటా వినవద్దు. నేను ‘గద్దర్ పార్టీ’తో, అలాగే ఏజెన్సీలతో కూడా పోరాడాలి. వాటితో పోరాడే ధైర్యం నాకు ఉంది. నేను తలవంచడానికి సిద్ధంగా లేను’’ అని ఆమె అన్నారు.
పొరుగు దేశాల నుంచి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వ హక్కులు కల్పించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పుడు అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న పౌరసత్వ రికార్డులు, చట్టాలు సరిపోతాయని మమతా బెనర్జీ అన్నారు. తన రాజకీయ ప్రత్యర్థుల ధనబలం, కేంద్ర సంస్థలపై పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, రాజకీయ దురుద్దేశంతోనే టీఎంసీపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. దేశంలో ఎవరు అధికారంలోకి వస్తారో తేల్చేందుకు మరో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేద్దామని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో విఫలమైతే అంతా ముగిసిపోతుందని అన్నారు.