కర్ణాటకపై బీజేపీకి విజన్ లేదని కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మోడీ ఫ్యాక్టర్ పని చేయదని అన్నారు. తమ పార్టీ 140 పైగా స్థానాల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 140కి పైగా సీట్లు గెలుచుకుంటుందని, సీఎం పదవి విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు మంచి మెజారిటీ వస్తుందని, 1978లో ఆ రాష్ట్రంలో పార్టీ సాధించిన విజయం మాదిరిగానే ఈ సారి కూడా లోక్ సభ ఎన్నికలకు తలుపులు తెరుస్తుందని ఆయన వార్తా సంస్థ ‘పీటీఐ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
మణిపూర్ అల్లర్లలో ఇంఫాల్ ట్యాక్స్ అసిస్టెంట్ మృతి.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఐఆర్ఎస్ ఆసోసియేషన్
అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో యూనిఫాం సివిల్ కోడ్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వంటి అంశాలను బీజేపీ లేవనెత్తిందని, ఇది రాష్ట్రం పట్ల వారి ఆలోచనలు, దార్శనికత, దివాళాకోరుతనానికి నిదర్శనమని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. కర్ణాటకపై బీజేపీకి ఎలాంటి ఎజెండా, విజన్ లేదని అన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ఫ్యాక్టర్ పనిచేయదని ఆయన పేర్కొన్నారు.
తమ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవని, అవన్నీ మీడియా సృష్టించినవేనని, వాటిలో వాస్తవం లేదని శివకుమార్ అన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ నాయకత్వం ఐక్యంగా ఉందని, క్షేత్రస్థాయిలో, సామాజిక మాధ్యమాల్లో తమ సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పార్టీ కార్యకర్తలు చాలా చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు సమిష్టి కృషి చేస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవికి తాను బలమైన పోటీదారుడినని, కర్ణాటకలో పార్టీ మెజారిటీ సాధించేలా చూడడమే తన మొదటి ప్రాధాన్యత అని శివకుమార్ అన్నారు. గత మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అనేక క్యాంపెయిన్ లు చేసిందని అన్నారు. 78 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారని తెలిపారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్రను విజయవంతం చేశామని అన్నారు. మూడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని అన్నారు.
పీఎఫ్ఐ, భజరంగ్దళ్ వంటి సంస్థలపై నిషేధం విధించడం సహా చట్టప్రకారం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడంపై తలెత్తిన వివాదంపై ప్రశ్నించగా.. సమాజాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని శివకుమార్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయిందని అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల విషయంలో సామాన్యులకు ఉపశమనం కలిగించడంలో విఫలమయ్యారని చెప్పారు. ఇప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలతో సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే కర్ణాటకలో అది పని చేయలేదని, ప్రజలు వాటిని తరిమికొడతారని ఆయన పేర్కొన్నారు.
నేడు కింగ్ చార్లెస్ పట్టాభిషేక వేడుక.. భారత్ నుంచి ఎవరెవరు హాజరు కానున్నారంటే ?
బీజేపీకి దక్షిణాదికి కర్ణాటక ముఖద్వారంగా ఉండటంపై అడిగిన ప్రశ్నకు శివకుమార్ సమాధానమిస్తూ.. రాష్ట్రంలో పనితీరు సరిగా లేకపోవడం, అవినీతి, పెద్ద ఎత్తున నిరుద్యోగం కారణంగా కర్ణాటక ప్రజలు బీజేపీ ముఖంపై గేటు మూసివేశారని అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)లను అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంపై ప్రశ్నించగా, ఇది కచ్చితంగా బీజేపీ సమస్య అని శివకుమార్ అన్నారు. వారికి కర్ణాటక, అక్కడి ప్రజలు అర్థం కావడం లేదని ఆరోపించారు. కాగా.. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న పోలింగ్ జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
