కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా భార్య సాచీ మార్వా కారును ఇద్దరు యువకులు రాత్రి సమయంలో వెంబడించారు. ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టారు. ఈ విషయం ఆమె ఫోన్ ద్వారా పోలీసులకు తెలియజేస్తే.. దానిని తేలికగా తీసుకోమని చెప్పారని ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) టీం కెప్టెన్, క్రికెటర్ నితీశ్ రాణా భార్య సాచీ మార్వాకు దేశ రాజధానిలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఢిల్లీలో ఇద్దరు యువకులు ఆమె కారును వెంబడించి అకారణంగా, ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టారు. దీంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
సాచీ మార్వా తన కారులో ఇటీవల ఇంటికి తిరిగి వస్తుండగా టూ వీలర్ పై ఇద్దరు యువకులు ఆమె కారును ఫాల్ అయ్యారు. కావాలనే వెంట పడుతూ ఢీకొట్టారు. ఈ సమయంలో ఆ యువకుల ఫొటో తీసిన మార్వ.. తనకు ఎదురైన అనుభవాన్ని తరువాత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న సంఘర్షణను అందులో షేర్ చేశారు.
అయితే ఈ విషయం పోలీసులకు చెబితే వాళ్లు తేలికగా తీసుకున్నారని అందులో చెప్పారు. మీరు ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు కాబట్టి.. ఇక దానిని మర్చిపోండని తెలిపారని ఆరోపించారు. ఇక ముందు అలా జరిగితే ఆ బైక్ నెంబర్ నోట్ చేసుకోవాలని సూచించారని పేర్కొన్నారు.
తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న వివరాల ప్రకారం.. ‘‘ఢిల్లీలో అది ఒక సాధారణ రోజు. నేను నా పనులు పూర్తి చేసుకొని కారులో ఇంటికి వస్తున్నాను. వీళ్లు (ఫొటోలో ఉన్న యువకులు) యాదృచ్ఛికంగా నా కారును ఢీకొట్టడం మొదలుపెట్టారు.! కారణం లేకుండానే వెంబడించారు. నేను ఈ విషయంపై ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీంతో వారు నాకు ‘ఇప్పుడు మీరు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఇక దానిని వదిలేయండి! వచ్చేసారి ఆ బైక్ నెంబర్ నోట్ చేసుకోండి’ అని అన్నారు. సరే కెప్టెన్. వచ్చేసారి వారి ఫోన్ నంబర్లు కూడా తీసుకుంటాను’’ అని ఆమె తన స్టోరీలో రాసుకొచ్చారు.
