కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో అనుసరించిన వ్యూహాం రాజస్తాన్‌లోనూ అమలు చేసి అధికారం కైవసం చేసుకోవాలన్న బీజేపీ ఆశలు అడియాసలు అయ్యాయి. కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తిరిగి సొంత గూటికి చేరడంతో రాజస్థాన్‌లో సంక్షోభం దాదాపు ముగిసిపోయినట్లే.

ఈ నేపథ్యంలో అశోక్ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. గెహ్లాట్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పార్టీ సీనియర్ నేతలు మురళీధర్ రావు, వసుంధర రాజేలు గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో ముచ్చటించారు.

కాంగ్రెస్ సర్కార్‌కు ముగింపు పలుకుతామని, అసెంబ్లీలో శుక్రవారం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని విపక్షనేత గులాబ్ చంద్ కటారియా స్పష్టం చేశారు.

Also Read:మర్చిపోండి, క్షమించండి: మద్దతుదారుల సమావేశంలో గెహ్లాట్ వ్యాఖ్యలు

మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలు  పార్టీలోకి రావడంతో వారిని క్షమించి కలుపుకునిపోదామని సీఎం అశోక్ గెహ్లాట్ సహచర ఎమ్మెల్యేలను కోరారు. ప్రజాస్వామ్య స్పూర్తితో తాము ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌తో జరిపిన చర్చలు ఫలించడంతో రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ముగిసిన సంగతి తెలిసిందే. అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన సచిన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.