ప్రతిపక్ష నేతలందరినీ అరెస్టు చేసేందుకు బీజేపీ కుట్ర: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
Mamata Banerjee: 2024 లోక్‌సభ ఎన్నికల్లో సులువుగా గెలుపొందడం కోసం బీజేపీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నుతుందని వ్యాఖ్యానించారు.
Kolkata: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కారుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలందరినీ అరెస్టు చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2024 లోక్ సభ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించడం కోసం విపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ''ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలందరినీ అరెస్టు చేసి ఖాళీ దేశంలో అందరూ తమకే ఓటు వేస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కుట్రకు తెరలేపారు అని మమతా బెనర్జీ ఆరోపించినట్టు'' ఇండియా టూడే కథనం పేర్కొంది. ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు తమ ఐఫోన్లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఆపిల్ నుంచి ప్రతిపక్ష నేతలకు అందిన భద్రతా హెచ్చరికలను గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ఐదారుగురు ఎంపీలు తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయని చెప్పారని అన్నారు. మన దేశాన్ని చూసి ఇతర దేశాలు ఏం చెబుతాయో, ఏమనుకుంటాయో చెప్పాలని మమతా బెనర్జీ ప్రశ్నించారు.
ప్రతిపక్ష కూటమికి ఇండియా అని సంక్షిప్త పదాన్ని ఉపయోగించడంపై ఢిల్లీ హైకోర్టుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేసిన ప్రకటనపై మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ పొత్తులను నియంత్రించే అధికారం తమకు లేదని కోర్టుకు తెలిపింది. ''కనీసం వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇండియాను మరువలేం. ఇండియా మన మాతృభూమి. భారత్ కూడా మా మాతృభూమి'' అని మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ అరెస్టుపై అడిగిన ప్రశ్నకు మమతా బెనర్జీ సమాధానమిస్తూ రాష్ట్రంలోని గత లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంపై నిందలు వేశారు. కోట్లాది రూపాయల రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మల్లిక్ ను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలో ఆహార, సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు.
లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కనీసం కోటి నకిలీ రేషన్ కార్డులను జారీ చేసిందనీ, పశ్చిమ బెంగాల్ సీఎంగా తాను అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణం బయటపడిందని మమతా బెనర్జీ అన్నారు. రేషన్ కార్డుల డిజిటలైజేషన్ లో జ్యోతిప్రియ మల్లిక్ ప్రశంసనీయమైన పని చేశారని ఆమె కొనియాడారు. తమ పార్టీ ఎంపీ మహువా మొయిత్రాకు సంబంధించి జరుగుతున్న నగదు వివాదంపై మమతా బెనర్జీ స్పందిస్తూ ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య అని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఎంజిఎన్ఆర్ఇజిఎ నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తమ పార్టీ నిర్దేశించిన నవంబర్ 1 గడువును నవంబర్ 16 వరకు పొడిగించామన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ సీవీ ఆనందబోస్ హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు.