ఎన్డీఏలోకి టీడీపీ, జనసేనలకు స్వాగతం - బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
టీడీపీ, జనసేనలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్డీఏ కూటమిలోకి స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో శనివారం సాయంత్రం పోస్ట్ పెట్టారు.
టీడీపీ, జనసేనలు ఎన్డీఏలోకి చేరుతున్నట్టు బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఏపీలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం సాయంత్రం తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో ఎన్డీఏలోకి రెండు పార్టీలకు స్వాగతం పలికారు.
బీజేపీ కిచెన్ కిట్ పంపిణీలో తొక్కిసలాట.. ఓ మహిళ దుర్మరణం, పలువురికి గాయాలు
‘‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీయేలో చేరడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ డైనమిక్, దార్శనిక నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేనలు దేశ పురోగతికి, రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయి’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.
కాగా.. శనివారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరి మధ్య కొన్ని గంటల పాటు చర్చలు జరిగాయి. అనంతరం పొత్తుపై ఏకాభిప్రాయానికి వచ్చారు. కాగా.. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఏకకాలంలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీట్ల సర్దుబాటు జరిగింది. అయితే 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధికంగా సీట్లు తీసుకోబోతోంది. జనసేన-బీజేపీకి 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేనకు 24 సీట్లు ఇది వరకే ఉండగా.. బీజేపీకి 6 సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీకి 6 లోక్ సభ స్థానాలు, జనసేనకు 2 లోక్ సభ స్థానాలు కేటాయించారు.
అయితే టీడీపీ, బీజేపీలు బంధం కొత్తగా ఏర్పడిందేమీ కాదు.. ఈ రెండు పార్టీల మధ్య చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. 1996లో టీడీపీ మొదటి సారిగా ఎన్డీయేలో చేరింది. మళ్లీ పలు కారణాల వల్ల విడిపోయింది. 2014లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. టీడీపీకి కేంద్ర మంత్రి వర్గంలో కూడా చోటు దక్కింది. కానీ 2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది.
రాముడు ఇప్పుడు ఉంటే.. బీజేపీ ఈడీని ఆయన ఇంటికి పంపేది - కేజ్రీవాల్
2019లో వచ్చిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చతికిలపడిపోయింది. వైఎస్ జగన్ ఆధ్వర్యంలని వైసీపీ ఇటు రాష్ట్రంలో ఘన విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ సీట్లను కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో అధికారం చేపట్టాలని భావిస్తున్న టీడీపీ తన మిత్రపక్షంగా ఉన్న జనసేనను, గతంలో కలిసి నడిచిన బీజేపీని కలుపుకొని పోవాలని భావిస్తోంది. అందుకే ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది.