న్యూఢిల్లీ: బెంగాల్‌లో మమత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ చీఫ్  అమిత్ షా అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు కోల్‌కత్తాలో చోటు చేసుకొన్న విధ్వసంపై ఆయన స్పందించారు.

బుధవారం నాడు న్యూఢిల్లీలో బీజేపీ చీఫ్ అమిత్ షా మీడియాతో మాట్లాడారు. మంగళవారం రాత్రి కోల్‌కత్తాలో చోటు చేసుకొన్న విధ్వంసానికి టీఎంసీయే కారణమని చెప్పారు. హింసాత్మక ఘటనలతో టీఎంసీ నిజస్వరూపం బట్టబయలైందన్నారు.

బీజేపీకి చెందిన పోస్టర్లను టీఎంసీ కార్యకర్తలు చింపేశారని ఆయన గుర్తు చేశారు. తమ ర్యాలీపై మూడు దఫాలు టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని  ఆయన ఆరోపించారు.పెట్రోల్ బాంబులతో కూడ టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని ఆయన విమర్శించారు.

ఈశ్వరచంద్ర విగ్రహాన్ని టీఎంసీ  కార్యకర్తలే ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. కాలేజీ తాళాలు పగులగొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు టీఎంసీ పాల్పడుతోందన్నారు. 

మమత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.టీఎంసీ కేవలం 42 ఎంపీ స్థానాలకు మాత్రమే పోటీ పడుతోందన్నారు.కానీ, ఈ దఫా బీజేపీ  300 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.