Asianet News TeluguAsianet News Telugu

ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్థి కోసం బీజేపీ అభ్యర్థి ఉపసంహరణ... ఆంధేరి బైపోల్‌లో కీలక మలుపులు

మహారాష్ట్రలో ఆంధేరీ ఈస్ట్‌ ఉపఎన్నికలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి రుతుజ లట్కే పోటీ చేస్తున్నారు. ఆమెకు ఎన్సీపీ, ఎంఎన్ఎస్ మద్దతు తెలిపాయి. అంతేకాదు, బీజేపీ అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని రాజ్ ఠాక్రే ఫడ్నవీస్‌కు లేఖ కూడా రాశారు. దీంతో బీజేపీ తమ అభ్యర్థిని ఉపసంహరిస్తున్నట్టు వెల్లడించింది.
 

bjp candidate withdrew nominations to make sure  winning of uddhav thackery shivasena candidate rutuja latke
Author
First Published Oct 17, 2022, 4:26 PM IST

ముంబయి: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన, బీజేపీలు బలమైన ప్రత్యర్థి పార్టీలు. ఈ రెండు పోటాపోటీగా పోరాడుతాయి. ఎన్నికల విషయంలో ఇక చెప్పాల్సిందేమీ లేదు. కానీ, మహారాష్ట్రలో తాజాగా జరుగుతున్న ఆంధేరి ఉపఎన్నికలో మాత్రం ఈ వైరి పోరాటం కనిపించలేదు. ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ అభ్యర్థి గెలవడానికి బీజేపీ తన అభ్యర్థిని వెనక్కి తీసుకోవడం గమనార్హం. దీని వెనుక గల ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.

ఆంధేరి ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రమేశ్ లట్కే ఇటీవలే మరణించారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఆయన శివసేన పార్టీ నేత. ఈ స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తున్నది. దీంతో ఈ స్థానంలో రమేశ్ లట్కే భార్య రుతుజ లట్కే బరిలోకి దిగారు. ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన టికెట్ పై ఆమె పోటీ చేస్తున్నారు. 

రుతుజ లట్కే బీఎంసీలో క్లర్క్‌గా చేశారు. ఆమె రాజీనామా చేసి ఈ పోటీలోకి దిగారు. ఆమె రాజీనామాను అంగీకరించవద్దని ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన నేతలు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుని రాజీనామా చేసి బరిలో నిలిచింది.

Also Read: బై పోల్ ముంగిట బీజేపీకి రాజ్ ఠాక్రే ఊహించని రిక్వెస్ట్.. ‘డియర్ దేవేంద్ర యాక్సెప్ట్ చేస్తావనుకుంటున్నా’

అనూహ్యంగా ఈమెకు మిగతా పార్టీల నుంచి కూడా మద్దతు వస్తున్నది. ఉద్ధవ్ ఠాక్రే సోదరుడు.. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే నుంచి ఈ మద్దతు స్పష్టంగా కనిపించింది. ఆయనే స్వయంగా బీజేపీకి లేఖ రాశారు. డియర్ ఫ్రెండ్ దేవేంద్ర.. ఈ స్థానం నుంచి మీ అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. రమేశ్ లట్కే మంచి నేత, ఆయన భార్య గెలుపే ఆయనకు ఇచ్చే నివాళి అంటూ తెలిపారు. ఎన్సీపీ కూడా ఆమెకే మద్దతు తెలిపింది.

Also Read: ‘పతనం అక్కడే మొదలవుతుంది’.. అన్నయ్య ఉద్ధవ్ ఠాక్రేకు రాజ్ ఠాక్రే కౌంటర్!.. ఫ్యామిలీ ఫైట్?

ఈ నేపథ్యంలోనే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ బవంకులే తాజాగా నాగ్‌పూర్‌లో మాట్లాడారు. ఆంధేరీ ఈస్ట్ ఉపఎన్నికలో పోటీ చేయవద్దని బీజేపీ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ‘బీజేపీ నుంచి నామినేషన్ వేసి ముర్జి పటేల్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటారు. లేదంటే.. ఈ ఎన్నికలో మేమే గెలిచేవాళ్లం’ అంటూ పేర్కొన్నారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్థి గెలుపు కోసం బీజేపీ మద్దతు ఇచ్చినట్టయింది.

Follow Us:
Download App:
  • android
  • ios