దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఉంటే 2024లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని 100 కంటే తక్కువ సీట్లకే పరిమితం చేయొచ్చు అని బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ అన్నారు. విపక్ష పార్టీలను ఏకం చేయడమే తన లక్ష్యం అని తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితే బీజేపీ 100 కంటే తక్కువ సీట్లకే పరిమితమవుతుందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. శనివారం పూర్నియాలో జరిగిన మహాఘటబంధన్ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ విషయంలో కాంగ్రెస్ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
"ఈ విషయంలో కాంగ్రెస్ త్వరగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మీరు (కాంగ్రెస్) నా సూచనను అంగీకరిస్తే, మేము బీజేపీని 100 లోపు సీట్లకు పరిమితం చేయొచ్చు. మీరు అలా చేయకపోతే, ఏం జరుగుతుందో మీకు తెలుసు’’ అని అన్నారు. బీజేపీని అధికారం నుంచి దింపేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని ఆయన తెలిపారు. దానిని నిజం చేయడానికి తాను ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పారు. బీజేపీని దేశం మొత్తం నుంచి తుడిచివేయాలని అన్నారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి.. కఠిన హెచ్చరికలు జారీచేస్తున్న రైల్వే అధికారులు..
మత ప్రాతిపదికన ప్రజలను విభజించడం ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని నితీష్ కుమార్ ఆరోపించారు. చరిత్రను తిరగరాయాలని ఆ పార్టీ తహతహలాడుతోందని, స్వాతంత్ర్య పోరాటంలో ఎవరు ఏమి చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. దానిని ఎవరూ మర్చిపోకూడదని తెలిపారు. అనంతరం అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంపై ఆయన విరుచుకుపడ్డారు. ఆ పార్టీని మైనారిటీ ఓట్లను విభజించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఏజెంట్ అని తెలిపారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయడం తప్ప దేశానికి, బీహార్‌కు చేసిందేమీ లేదని సీఎం ఆరోపించారు. ‘‘ బీహార్‌కు ప్రత్యేక హోదా ఏమైంది? సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు కేంద్రం వ్యతిరేకంగా ఉంది. కుల ఆధారిత జనాభా గణనకు వారు అనుకూలంగా లేకపోవడమే కారణం ’’ అని ఆయన ఆరోపించారు. 2024లో లోక్‌సభకు, 2025లో బీహార్‌లో ఎన్నికలు జరిగినప్పుడు వారికి (బీజేపీ) వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాట్లాడారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ)కి ఉపేంద్ర కుష్వాహ రాజీనామా చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. మహారాష్ట్రలో శివసేనకు చేసినట్టుగానే బీహార్ లో జేడీ (యూ)కి చేయాలని అనుకుందని ఆరోపించారు. కానీ బీహార్ ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని అన్నారు. 2024 ఎన్నికలకు ముందు బీజేపీని దేశం నుంచి తుడిచిపెట్టడానికి ప్రతిపక్షాల ఐక్యత తక్షణ అవసరమని అన్నారు. ‘‘బీహార్‌లో ఏడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అలాగే నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలి’’ అని అన్నారు.
దేశంలో ధరల పెరుగుదల వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మత విద్వేషాలను వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీతో పొత్తు తెంచుకున్నందుకు కుమార్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కు సున్నా నిధులు కేటాయించారని, అభివృద్ధి పనులన్నీ గుజరాత్‌లో మాత్రమే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆర్‌జేడీతో కలవడం వల్ల బీహార్‌లో ‘‘జంగల్ రాజ్’’ తిరిగి వచ్చిందన్న ఆరోపణలను తోసిపుచ్చిన తేజస్వీ.. రాష్ట్రంలో ‘‘జనతా రాజ్ ’’ నడుస్తోందన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఆర్మీ జవాన్‌ను కాల్చి చంపిన మావోయిస్టులు..
ఈ సమావేశానికి హాజరైన సీపీఐఎంఎల్(ఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ.. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ దుష్పరిపాలన దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, మతతత్వాలను రెచ్చగొట్టి సామాజిక సామరస్యానికి, దేశ సమగ్రతకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న ఫాసిస్టు శక్తులపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
