ఉత్తర కర్ణాటక ఉద్యమం "కమలం" ఎత్తుగడా..?

bjp behind in North Karnataka separate statehood demand
Highlights

కర్ణాటకలో అధికారం అందినట్లే అంది చేజారిపోవడం ఆ పార్టీ క్యాడర్‌ను నిరాశలోకి నింపింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిన ఎక్కువ సీట్లు సాధించాలనుకుంటోన్న కమలం కర్ణాటకనే నమ్ముకుంది.. దీనిపై ఎత్తులు వేస్తుండగా ప్రత్యేక సెంటిమెంట్ రగలడంతో.. దానిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు

నీళ్లు, నిధులు, నియామాకాలు, భాష, యాస, వివిక్షలు.. దేశంలో ఎక్కడ ఏ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తీసుకున్నా ఇవే ప్రాతిపదికలు. నాలుగేళ్ల క్రితం ముగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా పై వాటి ఆధారంగానే తమ హక్కులను సాధించేందుకు రాష్ట్రాన్ని విడదీయాలనే డిమాండ్‌ను దేశం ముందు ఉంచింది. ఎన్నో బలిదానాలు, పోరాటాల ఫలితంగా భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. 

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో అనేక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌లు ఊపందుకున్నాయి. బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, గూర్ఖా లాండ్, తులునాడు, ఉత్తర తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక ఉద్యమాలు తెర మీదకు వచ్చాయి. అయితే కాలక్రమంలో అవన్ని చల్లారిపోయాయి. అయితే తాజాగా కర్ణాటకలోని ఉత్తర ప్రాంతం తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటానికి దిగారు. కర్ణాటకను దక్షిణ కర్ణాటక ప్రాంతం వారే ముఖ్యమంత్రులుగా పాలిస్తున్నారని.. ఉత్తర కర్ణాటకకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పెద్ద ఉద్యమం బయలుదేరింది.. 

ఇటీవల శాసనసభలో సీఎం కుమారస్వామి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉత్తర కర్ణాటకకు అన్యాయం జరిగిందంటూ ప్రత్యేకవాదులు వాదిస్తున్నారు. దక్షిణ కర్ణాటకతో పోలిస్తే.. ఉత్తర కర్ణాటక వాసుల వేషభాషలు, ఆచార వ్యవహారాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఉత్తర కర్ణాటకలోని కన్నడ మాండలికంపై హిందీ, ఉర్దూ, తెలుగు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మైసూర్, బెంగళూరు తదితర ప్రాంతాలు అభివృద్ధి చెందినట్లు ఉత్తర కన్నడ  ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు.

దీంతో అక్కడి ప్రత్యేకవాదులు ఉత్తర కర్ణాటక రాజ్య పోరాట సమితి పేరుతో ఉద్యమానికి రెడీ అయ్యారు.. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలతో ఒక్కసారిగా వేడిని రగిల్చారు. దశాబ్దాలుగా వివిక్షను ఎదుర్కొంటున్న ఆ ప్రాంతవాసులు కూడా ప్రత్యేకవాదం వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వెనుక బీజేపీ ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ నేత గాలి శ్రీరాములు ఈ ఉద్యమానికి బహిరంగంగానే మద్ధతు ప్రకటించడం.. తెలంగాణ తరహా పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానని చెప్పడం అనుమానాలను రేకిత్తిస్తోంది. 

మరోవైపు బీజేపీకి అండగా ఉండే మఠాధిపతులు ఇవాళ బెళగావిలోని సువర్ణసౌధ వద్ద సత్యాగ్రహనికి దిగడం ఈ సంఘటనలన్నీ కమలం వైపు వేలేత్తి చూపుతున్నాయి. సహజంగానే చిన్న రాష్ట్రాలకు ఎప్పుడూ అనుకూలమనే ప్రకటించే బీజేపీ నైతిక సిద్ధాంతాన్ని మనం గుర్తుంచుకోవాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణకి మద్ధతిచ్చి ఆ ప్రాంతంలో బీజేపీ లాభపడాలని చూసిందన్నది  వాస్తవం. ఇదే సమయంలో ఉత్తర కర్ణాటక ప్రజల డిమాండ్‌ను తాను గౌరవిస్తానని.. చెబుతూనే రాష్ట్రం ముక్కలైతే తాను ఎంత మాత్రం ఒప్పుకోనని స్పష్టం చేయడంతో బీజేపీ స్టాండ్ ఏంటో అర్థం కావడం లేదని విశ్లేషకుల వాదన.

మరోసారి కేంద్రంలో అధికారాన్ని అందుకోవాలని బీజేపీ.. ఈ సారి ఢిల్లీని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉన్నాయి. దీనిలో భాగంగానే పెద్ద రాష్ట్రాలపై గురి పెట్టింది కమలం.. ఆయా రాష్ట్రాల్లో ఎప్పటి  నుంచో ఉన్న సమస్యల పరిష్కారానికి మేనిఫెస్టోలో ప్రధానంగా స్థానం కల్పించాలని భావిస్తోంది. 

ముఖ్యంగా దక్షిణాదిలో జెండా పాతాలని వ్యూహాలు రచించినప్పటికీ.. అవి వర్కవుట్ కావడం లేదు.. కర్ణాటకలో అధికారం అందినట్లే అంది చేజారిపోవడం ఆ పార్టీ క్యాడర్‌ను నిరాశలోకి నింపింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిన ఎక్కువ సీట్లు సాధించాలనుకుంటోన్న కమలం కర్ణాటకనే నమ్ముకుంది.. దీనిపై ఎత్తులు వేస్తుండగా ప్రత్యేక సెంటిమెంట్ రగలడంతో.. దానిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.. 

loader