నాగాల్యాండ్‌లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 60 స్థానాల్లో 35 నుంచి 43 సీట్లను ఎన్‌డీపీపీ, బీజేపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నదని అంచనా వేశాయి.
ఈశాన్య రాష్ట్రం నాగాల్యాండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. మళ్లీ బీజేపీ కూటమినే అధికారం వరిస్తుందని ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ, ఎన్‌డీపీపీ కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని జీన్యూస్-మ్యాట్రైజ్, ఇండియా టుడే యాక్సిస్, టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ వివరించాయి. నాగాల్యాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ మార్క్ 31 సీట్లు అవసరం. నాగాల్యాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్‌డీపీపీ కూటమికి 35 నుంచి 43 సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని జీన్యూస్ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. కాగా, కాంగ్రెస్‌కు ఒకటి నుంచి మూడు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించింది. కాగా, ఎన్‌పీఎఫ్‌కు రెండు నుంచి ఐదు స్థానాల్లో గెలుపు వరించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ఇండియా టుడే యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఎన్‌డీపీపీ, బీజేపీ కూటమికి 38 నుంచి 48 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎన్‌పీఎఫ్‌కు 3 నుంచి 8 సీట్లు, కాంగ్రెస్ ఒకటి లేదా రెండు స్థానాలకే పరిమితం అయ్యే చాన్స్ ఉన్నది. ఇతరులకు ఐదు నుంచి 15 సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని ఈ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీజేపీ, ఎన్‌డీపీపీ కూటమి 39 నుంచి 49 స్థానాలను గెలుచుకుంటుంది. ఎన్‌పీఎఫ్ 4 నుంచి 8 స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా, కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా డౌటే అని ఈ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
నాగాల్యాండ్‌లో ఈ రోజు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 82 శాతం ఓటింగ్ నమోదైంది.అందులో ఎన్‌డీపీపీ, బీజేపీ కూటమి 67 శాతం ఓట్లను రాబట్టుకుందని జీ న్యూస్ అంచనా వేసింది.
Also Read: త్రిపురలో మరోసారి అధికారం బీజేపీదే.. ఎగ్జిట్ పోల్ సంస్థల అంచనా.. ఎన్ని సీట్లు వస్తాయంటే..
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీల ఎన్నికలకు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు వారి వారి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. త్రిపురలో ఈ నెల 16న పోలింగ్ జరిగింది. మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మాత్రం సోమవారం (ఫిబ్రవరి 27) పోలింగ్ నిర్వహించారు. నాగాలాండ్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో 59 చోట్ల మాత్రమే ఎన్నిక నిర్వహించారు. నాగాలాండ్‌లోని అకులుటో నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఖేకాషీ సుమీ బరిలో నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి కజీటో కినిమి పోటీ లేకుండా విజయం సాధించారు. దీంతో నాగాలాండ్‌లో బీజేపీ తన ఖాతాను తెరిచింది.
నాగాలాండ్‌లో మొత్తం 13.17 లక్షల ఓటర్లు ఉన్నారు. నాగాలాండ్ ప్రజలు మొత్తం 183 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికల ద్వారా నిర్ణయించనున్నారు. మొత్తం అభ్యర్థుల్లో కేవలం నలుగురే మహిళలు ఉన్నారు. నాగాలాండ్‌లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ), నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఈ కూటమి చూస్తుంది. ఈ రెండు పార్టీలు కూడా 20:40 రేషియోలో ఎన్నికల బరిలో నిలిచాయి. బీజేపీ నుంచి 20 మంది, ఎన్‌డీపీపీ నుంచి 40 మంది అభ్యర్తులు బరిలో నిలిచారు. మరోవైపు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) 22 చోట్ల, కాంగ్రెస్ 23 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్‌సీపీ 12 చోట్ల, జేడీయూ 7 చోట్ల, ఎల్‌జేపీ (రామ్ విలాస్) 15 చోట్ల, ఆర్‌పీఐ (అథవాలే) 9 చోట్ల, ఆర్జేడీ 3 చోట్ల బరిలో నిలిచారు.
ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రముఖల విషయానికి వస్తే.. నాగాలాండ్ బీజేపీ చీఫ్ టెంజెన్ ఇమ్నా అలోంగ్.. అలోంగ్టాకీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆయన ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఈ స్థానం నుంచి జేడీయూ మాత్రమే తన అభ్యర్థి జె లాను లాంగ్‌చార్‌ను బరిలోకి దింపింది. మరోవైపు అందరిని ఆకర్షిస్తున్న మరో స్థానం ఘస్పని నుంచి.. బీజేపీ తరపున ఎన్ జాకబ్ జిమోమి, కాంగ్రెస్ అభ్యర్థిగా అకావి ఎన్ జిమోమి బరిలో ఉన్నారు. దిమాపూర్-3లో, ఎన్‌డీపీపీ అభ్యర్థి హెకానీ జఖాలు పోటీలో ఉండగా.. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఈ స్థానం నుంచి అజెటో జిమోమికి టికెట్ ఇచ్చింది. ఇక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మార్చి 2వ తేదీన జరగనుంది.
