త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని.. మరోసారి అక్కడ అధికారం నిలపుకుంటుందని ఇండియా టూడే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. త్రిపురలో బీజేపీ విజయం సాధిస్తుందని.. మరోసారి అక్కడ అధికారం నిలపుకుంటుందని పలు సంస్థలకు చెందిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న త్రిపురలో అధికారం దక్కించుకోవాలంటే.. 31 సీట్లు సాధించాల్సి ఉంది. అయితే ఇండియా టూడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్.. త్రిపురలో బీజేపీ 36-45 మధ్యలో సీట్లు సొంతం చేసుకుంటుందని తెలిపింది. వామపక్ష పార్టీల కూటమి 6 నుంచి 11 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. తిప్రా మోతా పార్టీ 9 నుంచి 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది.
జీ న్యూస్- మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ కూడా త్రిపురలో బీజేపీ అధికారం దక్కించుకుంటుందని తెలిపింది. త్రిపురలో బీజేపీ కూటమి 29 నుంచి 36 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీ న్యూస్- మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. సీపీఎం కూటమి 13 నుంచి 21 స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపింది. త్రిపా మోతా పార్టీ 11 నుంచి 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందుతారని తెలిపింది.
జన్ కీ బాత్- ఇండియా న్యూస్..
బీజేపీ+-29-40
సీపీఎం+-9-16
తిప్రా మోతా పార్టీ-10-14
ఇతరులు-01
ఇక, ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీల ఎన్నికలకు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు వారి వారి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. త్రిపురలో ఈ నెల 16న పోలింగ్ జరిగింది. మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. త్రిపురలోని 60 స్థానాల్లో 20 సీట్లు గిరిజనులకు రిజర్వ్ చేయబడ్డాయి. త్రిపురలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ సత్తా చాటింది. ఆ ఎన్నికల్లో 36 స్థానాలు గెలుచుకుని త్రిపురలో తొలిసారిగా అధికారం చేపట్టింది. 2013లో అక్కడ బీజేపీకి కేవలం 1.54 శాతం ఓట్లు రాగా, 2018లో ఓట్ల శాతం 43 శాతానికి పెరిగింది.
అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించి త్రిపురలో రెండో సారి విజయం సాధించాలని బీజేపీ చూస్తోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ 55 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా.. దాని కూటమి ఐపీఎఫ్‌టీ ఆరు స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఒక స్థానంలో కూటమి పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొంది. మరోవైపు సీపీఎం 47 చోట్ల, కాంగ్రెస్ 13 చోట్ల బరిలో దిగాయి. మాజీ రాజకుటుంబ వారసుడు ప్రద్యోత్ దేబ్ బర్మన్ ‘‘త్రిపా మోతా’’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసి 42 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపారు. కాంగ్రెస్-సీపీఎం కూటమి, తిప్రా మోతా పార్టీల నుంచి బలమైన పోటీ ఉన్నప్పటికీ.. త్రిపురలో విజయంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక, 2018 ముందు వరకు త్రిపురలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్, సీపీఎంలు.. ఈసారి ఎలాగైనా త్రిపురలో అధికారం సొంతం చేసుకోవాలని భావిస్తున్నాయి.
ఇక, ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. మొత్తం 28.14 లక్షల మంది ఓటర్లలో దాదాపు 24.66 లక్షల మంది ఓటు వేశారు. భారత ఎన్నికల సంఘం ప్రకారం.. త్రిపురలో దాదాపు 88 శాతం మంది ఓటర్లు తమ ఓటు వేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో 89.38 శాతం అర్హత కలిగిన ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనగా.. 2013లో అత్యధికంగా 93 శాతం పోలింగ్ నమోదైంది.
అసెంబ్లీ ఎన్నికల నిలిచిన ముఖ్యమైన అభ్యర్థలు విషయాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుత సీఎం, బీజేపీ అభ్యర్థి మాణిక్ సాహా.. బర్దోవాలీ నుంచి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి చౌదరి.. సాబ్రూమ్ నుంచి బరిలో నలిచారు. ప్రద్యోత్ దేబ్ బర్మన్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇక, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే మార్చి 2వ తేదీన జరగనుంది.
