దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనేది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు. మొదట కాంగ్రెస్ ముక్త్ భారత్ గా పని చేసిన వారు, ఇప్పుడు ప్రతిపక్ష్ ముక్త్ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.
మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ నాటకీయ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని మొత్తం స్వాధీనం చేసుకోవడమే కాషాయ పార్టీ లక్ష్యం అని ఆరోపించారు. అసలు ప్రతిపక్షాలే లేని దేశాన్ని బీజేపీ నిర్మించాలని అనుకుంటోందని తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు.
ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించడం లేదని అన్నారు. ‘‘ ప్రతిపక్షాలు లేని భారతదేశాన్ని నిర్మించే మార్గంలో వారు నడుస్తున్నారు. మొదట కాంగ్రెస్ ముక్త్ ఇండియా అని మాట్లాడారు. ఇప్పుడు దానిని ‘విపక్ష్ ముక్త్’ గా మార్చేశారు ’’ అంటూ బీజేపీపై అధిర్ రంజన్ చౌదరి ఆరోపణలు చేశారు. కాగా మూడు రోజుల కిందట ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రతిపక్షాల అభిప్రాయాలకు కేంద్ర ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని అందులో పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో పార్టీ నేత రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఇటీవల చేసిన నిరసనలను లేఖలో ప్రస్తావించారు.
కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన ఉద్దేశ్యాన్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు మితిమీరిన, అసమంజసమైన శక్తులను ఆశ్రయిస్తున్నారని ఆయన అన్నారు. ‘‘ నేను చాలా బాధతో ఈ ఉత్తరం రాస్తున్నాను. ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా మా స్వరాన్ని పెంచడానికి కాంగ్రెస్ పార్టీ శాంతియుత రాజకీయ ప్రదర్శనను నిర్వహిస్తోంది. కానీ ఆందోళన ఉద్దేశ్యాన్ని అడ్డుకోవడానికి ఢిల్లీ పోలీసులు మితిమీరిన, అసమంజసమైన శక్తులను ఆశ్రయిస్తున్నారు ’’ అని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోడీ విఫలం: కేటీఆర్
ఇదిలా ఉండగా శివసేన నేతృత్వంలో ఉన్న మహారాష్ట్ర ఎంవీఏ ప్రభుత్వం కూడా కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యే, మంత్రి ఏక్‌నాథ్ షిండే, దాదాపు 34 మంది ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ ఠాక్రే పై తిరుగుబాటు ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ జరిగిన తరువాతి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. వారంతా నిన్న రాత్రి వరకు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అయితే బుధవారం తెల్లవారుజామున అక్కడ నుంచి బయలుదేరి అస్సాం రాజధాని గౌహతికి విమానంలో చేరుకున్నారు. వీరంతా పార్టీ మారినా లేదా రాజీనామా చేసిననా మహారాష్ట్ర అసెంబ్లీలో ఠాక్రే ప్రభుత్వ బలం తగ్గి మెజార్టీ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.
Prophet row : హిందూ దేవుళ్లపై పరుష పదజాలం వాడే వారినే నేను ప్రశ్నించా - నవీన్ జిందాల్
ఈ విషయంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో అన్నీ సాధ్యమవుతున్నాయని విమర్శించారు. ‘‘ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఆదాయపు పన్ను విభాగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎప్పుడైనా న్యాయం జరగనప్పుడు న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఒత్తిడిలో ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన ఆటగా మారుతోంది ’’ అని ఆయన అన్నారు. కాగా.. మహారాష్ట్రలో 288 మంది సభ్యుల అసెంబ్లీలో MVAకి నాయకత్వం వహిస్తున్న శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షాలైన NCP (53), కాంగ్రెస్ (44)లు ఉన్నారు. ఇక్కడ సాధారణ మెజారిటీ మార్క్ 144గా ఉంది. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నా.. రాజీనామా చేసినా ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోతుంది.
