బీజేపీ ఐదో జాబితా.. బరిలో కంగనా రనౌత్, రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్
బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో కంగనా రనౌత్, అరుణ్ గోవిల్, నవీన్ జిందాల్ సహా కీలక నాయకులను అభ్యర్థులుగా ఖరారు చేసింది.
బీజేపీ ఆదివారం అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 111 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, రామాయణం ధారావాహికలో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్, నవీన్ జిందాల్ పేర్లు ఉన్నాయి. కాగా, ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి అనంత్ కుమార్ హెగ్డేను మార్చేసింది.
ఉజియార్‌పూర్ నుంచి నిత్యానంద్ రాయ్, బెగుసరాయ్ నుంచి గిరిరాజ్ సింగ్, పట్నా సాహిబ్ నుంచి రవి శంకర్ ప్రసాద్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి కంగనా రనౌత్, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, దుంకా నుంచి సీతా సోరెన్, బెల్గాం నుంచి జగదీశ్ శెట్టర్, చిక్కబల్లాపూర్ నుంచి సుధాకరణ్, సంబల్‌పూర్ నుంచి ధర్మేంద్ర ప్రదాన్, బాలాసోర్ నుంచి ప్రతాప్ సారంగి, పూరి నుంచి సంబిత్ పాత్రా, భువనేశ్వర్ నుంచి అపరజిత సారంగి, మీరట్ నుంచి అరుణ్ గోవిల్ సహా పలువురి అభ్యర్థిత్వాన్ని వెల్లడించింది.
గతంలో 291 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.