ఏకంగా చెరువునే దొంగిలించారు.. రాత్రికి రాత్రే మాయం చేశారు.. ఎక్కడంటే..
చెరువు పూడిక తీత పనుల పేరుతో ఏకంగా చెరువునే మాయం చేశారు. ఈ వింత దొంగతనం ఇప్పుడు బీహార్ లో వైరల్ గా మారింది.
పాట్నా: దొంగతనం అంటే ఇంట్లో పడి దోచుకోవడం.. బంగారం ఎత్తుకెళ్లడం లేదా టూ వీలర్లు, కార్లను కొట్టుకుపోవడం.. మరీ దోపిడీ అయితే ఇల్లు మొత్తం గుల్ల చేయడం తెలుసు. కానీ ఇటీవల దొంగలు తెలివి మీరారు. ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు వారికి ఆనడం లేదు. ఏకంగా కోట్లలో దర్జాగా దొంగతనం చేస్తున్నారు. అది కూడా బాహాటంగా అందరూ చూస్తుండగానే చేస్తున్నారు. ఎవ్వరికీ అది దొంగతనం అని అనుమానం రాకుండా చేస్తున్నారు.
అలా ఓ చెరువునే మాయం చేశారు దొంగలు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. గతంలో ఇలాగే రైలు డీజిల్ ఇంజిన్ ను, వందల మీటర్ల పొడవైన పట్టాలను దొంగిలించిన సంగతి తెలిసిందే. అది జరిగిన బీహార్ లోనే ఇప్పుడు ఈ దొంగతనమూ వెలుగు చూసింది. దీంతో ఇలాంటి వింత దొంగతనాలకు బీహార్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.
Free Bus: ఏపీ ఎన్నికలపై ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ ప్రభావం ఎంత?
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. రాత్రికి రాత్రే చెరువు మాయమై ఆ ప్రదేశంలో ఓ గుడిసె వెలిసింది. ఇది బీహార్ లోని దర్భంగా జిల్లాలో జరిగింది. ఇది చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సడెన్ గా చెరువు ఉండాల్సిన చోట మట్టి, గుడిసె కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఇదంతా ల్యాండ్ మాఫియా పని అని తేలింది. చెరువు భూమిని స్వాధీనం చేసుకోవడానికి చెరువును మట్టితో నింపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు వచ్చే సమయానికి వారు పారిపోయారు.
స్థానికుల ప్రకారం ఈ చెరువు ప్రజల ఆధీనంలో ఉంది. స్థానిక ప్రజలు ఇక్కడ చేపలు పట్టడం, ఇతర కార్యకలాపాల కోసం వాడుతుంటారు. దర్భంగాలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కారణంగా మాఫియా కన్ను చెరువుపై పడింది. చెరువు పూడిక తీత పేరుతో పనులు ప్రారంభించారు. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో మండల అధికారులు కొద్దిరోజులు పనులు నిలిపేశారు. ఆ తరువాత కబ్జాలు చేశారు. చెరువు పూర్తిగా కనిపించకుండా పోయేవరకూ ల్యాండ్ మాఫియా రాత్రిపూ చీకట్లో రహస్యంగా లెవలింగ్ పనులు చేసింది.
కేవలం 10-15 రోజుల్లోనే చెరువు మొత్తాన్ని మట్టితో నింపేశారు. రాత్రిపూట మాత్రమే పనులు జరిగాయని, అధికారులు ముందుగా సంఘటనా స్థలాన్ని సందర్శించి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారని సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డిపిఓ) అమిత్ కుమార్ తెలిపారు. దీంతో ఇప్పుడీ దొంగతనం విషయం వైరల్ అయ్యింది.
అంతకు ముందు బీహార్ లో నవంబర్, 2022న బెగుసరాయ్‌లోని రైల్వే యార్డ్ నుండి డీజిల్ ఇంజన్ ను దొంగిలించారు.యార్డ్‌కు సొరంగం తవ్వి విడిభాగాలను ఒక్కొక్కటిగా తరలిస్తూ దొంగిలించడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. అలా రిపేర్ కోసం వచ్చిన ఇంజన్ మొత్తాన్ని పట్టుకుపోయారు.
మరో ఘటనలో రోహ్తాస్ జిల్లాలో మొత్తం 60 అడుగుల వంతెనను దొంగిలించబడింది. ప్రభుత్వ అధికారి సహా ఎనిమిది మందిని అరెస్టు చేసి నిందితుల నుంచి 247 కిలోల ఐరన్ చానెల్స్ స్వాధీనం చేసుకున్నారు. దొంగలు జేసీబీలు, గ్యాస్ కట్టర్లు ఉపయోగించి వంతెనను కేవలం మూడు రోజుల్లోనే మాయం చేశారు.