Free Bus: ఏపీ ఎన్నికలపై ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ ప్రభావం ఎంత?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను ఆకట్టుకుని హామీలు, నిర్ణయాలపై చర్చ పెరుగుతున్నది. ఉచిత బస్సు ప్రయాణ హామీని టీడీపీ తన మేనిఫెస్టోలో చేర్చగా.. ఏకంగా అమలు చేస్తామని అధికార వైసీపీ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. కర్ణాటక, తెలంగాణలో ఈ హామీ ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరుణంలో ఏపీలో ఈ హామీ ప్రభావం ఎలా ఉంటుంది?
Free Bus Journey: మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సదుపాయం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చర్చలో ఉన్నది. తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నెరవేరుస్తూ డిసెంబర్ 9వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమల్లోకి తెచ్చింది. ఇంతకు ముందు కాంగ్రెస్ ఇదే హామీని కర్ణాటకలోనూ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉన్నది. ఇది సక్సెస్‌ఫుల్ ఫార్ములాగా మారింది. ఇటీవలే ఇది ఎన్నికల అంశంగా ప్రధానంగా ముందుకు వచ్చింది. త్వరలో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఉచిత బస్సు ప్రయాణ అవకాశం హాట్ టాపిక్‌గా మారుతున్నది.
టీడీపీ హామీ..
టీడీపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో.. ఈ హామీని చేర్చింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని పేర్కొంది. అధికార వైసీపీ కూడా వెంటనే అలర్ట్ అయినట్టు తెలుస్తున్నది. తెలంగాణలో ఈ స్కీమ్ విజయవంతంగా అమలవుతుండటంతో జగన్ ప్రభుత్వం కూడా అందుకోసం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
వైసీపీ కార్యచరణ..!
ఏపీలో రోజు 40 లక్షల మంది ఆర్టీసీ ప్రయాణిస్తుండగా అందులో 15 లక్షల మంది మహిళలు ఉన్నారు. మహిళలకు ఉచిత పథకాన్ని అమలు చేస్తే రూ. 4 కోట్ల భారం పడే అవకాశం ఉన్నదని అంచనాలు వస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని ఆర్టీసీని ప్రభుత్వం కోరినట్టు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే సంక్రాంతి నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వం సంకల్పించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమ హామీనే వైసీపీ కాపీ కొడుతున్నదని ఇది వరకే చంద్రబాబు విమర్శలు సంధించారు.
Also Read: TDP: ఏపీలో తెలంగాణ ట్రెండ్.. చంద్రబాబు, పవన్ రెండు స్థానాల్లో పోటీ? అల్లుడి కోసం సీటు త్యాగం!
ఇంపాక్ట్..
ప్రభుత్వం ఉచితాలు ఇవ్వడాన్ని దిగువ మధ్యతరగతి వర్గంలోని కొందరు, ఉద్యోగుల్లో కొందరు వ్యతిరేకిస్తారు. తమ పన్నుల డబ్బును ప్రభుత్వం వృథా చేస్తుందనే అభిప్రాయం వారిలో ఉంటుంది. ఇక ఏ పథకం అమలు చేసినా.. దానిపై సానుకూలత, ప్రతికూలతలు ఉండటం సాధారణం. మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశాన్ని ఇచ్చినందున.. తెలంగాణలో మాదిరిగానే సీట్లు దొరకడం లేదని వ్యతిరేకించే పురుషులూ ఉండొచ్చు. అయితే, ఈ వ్యతిరేకత లబ్ది పొందిన మహిళల నుంచి వచ్చే సానుకూల అభిప్రాయ తీవ్రత కంటే తక్కువ మోతాదులోనే ఉంటుంది.
Also Read: ఇలాంటి స్కామ్ కూడా ఉంటుందా? కడుపు చేసే ఉద్యోగం ఇస్తామని బోల్తా
ఏ పార్టీకి ప్లస్?
ఒక వేళ వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి నుంచే.. అంటే అసెంబ్లీ ఎన్నికలకు సుమారు రెండు నెలల ముందు నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తే దీని ప్రభావం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది? ఏ పార్టీని నష్టపెడుతుంది? పథకం అమలైతే మహిళలు హర్షిస్తారనడంలో సందేహం లేదు. అయితే.. వైసీపీనే కాదు, టీడీపీ అధికారంలో ఉన్నా ఈ పథకం అమలవుతుంది కదా.. అనే ఆలోచనలూ రాకమానవు. రేపటి సంగతి దేవుడు ఎరుగు.. ఒక వేళ టీడీపీ అమలు చేయకుంటే అనే సంశయాలూ రావొచ్చు. ఈ పథకం తొలిగా అమలు చేసిన వైసీపీకి కొంత మైలేజీ తీసుకువచ్చినా.. టీడీపీని చెప్పుకోదగ్గ స్థాయిలో డ్యామేజీ చేస్తుందని చెప్పలేమని విశ్లేషకులు చెబుతున్నారు.