Bilkis Bano: లొంగిపోయిన బిల్కిస్ బానో కేసు దోషులు
బిల్కిస్ బానో కేసులోని మొత్తం 11 మంది దోషులు ఆదివారం రాత్రి గుజరాత్‌లోని జైలు ముందు లొంగిపోయారు. ఈ మేరకు స్థానిక క్రైం బ్రాంచీ పోలీసు వెల్లడించారు.
Bilkis Bano: 2002 బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులోని మొత్తం 11 మంది దోషులు ఆదివారం రాత్రి గుజరాత్ జైలు ముందు లొంగిపోయారు. అదనపు సమయం కోసం దోషులు కోరిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత వారు లొంగిపోవడం గమనార్హం. పంచమహల్ జిల్లాలోని గోద్రా సబ్ జైలులో వారు సరెండర్ అయ్యారు. ఆదివారం రాత్రి జైలు అధికారుల ముందు లొంగిపోయినట్టు స్థానిక క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఎన్ఎల్ దేశాయ్ వార్తా ఏజెన్సీ పీటీఐకి వెల్లడించారు.
2022లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కింద ఈ దోషులను విడుదల చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గుజరాత్ ప్రభుత్వంపై మండిపడింది. వెంటనే దోషులంతా లొంగిపోవాలని ఆదేశించింది.
Also Read : Raja Singh: లోక్ సభ ఎన్నికల్లో రాజాసింగ్ ఆసక్తి.. హైదరాబాద్ సీటు వద్దని.. అక్కడి నుంచి పోటీకి సై
కాగా, ఆరోగ్య కారణాలు, సర్జరీ పెండింగ్‌లో ఉన్నదని, పెళ్లి సహా ఇతర కారణాలను పేర్కొంటూ దోషులు తమకు మరింత సమయం ఇవ్వాలని విజ్ఞప్తులు చేశారు. కానీ, ఆ విజ్ఞప్తులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
11 మంది దోషులు వీరే.. బకభాయ్ వొహానియా, బిపిన్ చంద్ర జోషి, కేసర్ భాయ్ వొహానియా, గోవింద్ నాయ్, జస్వంత్ నాయ్, మితేశ్ భట్, ప్రదీప్ మొర్దియా, రాధేశ్యామ్ షా, రాజుభాయ్ సోని, రమేశ్ చందన, శైలేష్ భట్‌లు జైలుకు చేరుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా వెల్లడించడం గమనార్హం.