Raja Singh: లోక్ సభ ఎన్నికల్లో రాజాసింగ్ ఆసక్తి.. హైదరాబాద్ సీటు వద్దని.. అక్కడి నుంచి పోటీకి సై
రాజాసింగ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి ససేమిరా అంటున్న ఆయన మహారాష్ట్రలోని ఔరంగబాద్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. చేవెళ్ల, జహీరాబాద్ స్థానాల నుంచీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సై అంటున్నట్టు సమాచారం.
Elections: రాజా సింగ్ బీజేపీ వేసిన సస్పెన్షన్ వేటు నుంచి బయటపడి.. మళ్లీ గోషా మహల్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆయన ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ ఈ సారి లోక్ సభ ఎన్నికల్లోనూ విజయపతాకాన్ని ఎగరేయాలని ఆశపడుతున్నారు. అయితే, ఆసక్తికరంగా ఆయన హైదరాబాద్ లోక్ సభ సీటును కాదనుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడ పోటీ చేస్తే ఏఐఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయే ముప్పు ఉందనే ఆలోచనలో ఈ స్థానం నుంచి పోటీని ఆయన కోరుకోవడం లేదని సమాచారం.
హైదరాబాద్ స్థానమే కాదు.. అసలు తెలంగాణ నుంచే కాదు.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న, ఈ ఆరోపణలతో కేసులు కూడా నమోదైన ఈ బీజేపీ నేత ఇటీవల ఔరంగాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోనూ నోరు పారేసుకున్నట్టు కథనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఔరంగాబాద్ లోక్ సభ ఎంపీగా ఏఐఎంఐఎ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ ఉన్నారు.
ఔరంగాబాద్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నట్టు రాజాసింగ్ బీజేపీ అగ్రనేతలకు తెలియజేసినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. అయితే, పార్టీ మాత్రం ఆయనను హైదరాబాద్ నుంచి బరిలో దింపాలని ఆలోచిస్తున్నది. కానీ, ఈ సీటు నుంచి పోటీ చేస్తే ఓటమి ముప్పు ఉన్నదని రాజా సింగ్ భయపడుతున్నట్టు తెలిసింది.
Also Read : Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో మోడీ నినాదాలు.. బస్సు దిగి వచ్చిన రాహుల్ గాంధీ
ఔరంగాబాద్‌లో బీజేపీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2019లో బీజేపీ, శివసేన అభ్యర్థి చంద్రకాంత్ ఖైరే.. ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ పై 4,492 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇక ఔరంగబాద్ కాదనుకుంటే.. చేవెళ్ల లేదా జహీరాబాద్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వాలని రాజా సింగ్ కోరుకుంటున్నట్టు తెలిసింది. ఈ నియోజకవర్గాల్లో రాజా సింగ్‌కు మంచి ఆదరణ ఉన్నదని సమాచారం.