న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఆర్జేడీ పార్టీ ఓటమికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడ కారణమనే అభిప్రాయాలను కూడ రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ బీహార్ లో ఆశించిన ఫలితాలను సాధించకపోవడంతో  కాంగ్రెస్ పార్టీలో మరోసారి అసమ్మతి నేతలు తమ స్వరాన్ని పెంచే అవకాశం లేకపోలేదు.  నాలుగు మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు విషయంలో కొందరు సీనియర్లు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల మహాకూటమిని కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం చేసిందని కాంగ్రెస్ అసమ్మతివాదుల గ్రూపునకు చెందిన సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

also read:బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020:40 అసెంబ్లీ సీట్లలో జేడీ(యూ) ను దెబ్బతీసిన ఎల్‌జేపీ

కాంగ్రెస్ పార్టీ బీహార్ లో 70 సీట్లలో పోటీ చేసి 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆర్జేడీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 75 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొంది.సీపీఐఎంఎల్ 19 సీట్లలో పోటీ చేసి 12 స్థానాల్లో గెలిచింది. 

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక విషయంలో చేసిన పొరపాట్లు కూడ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాజయానికి కారణమని అసమ్మతి నేతలు అభిప్రాయపడుతున్నారు.ఎంఐఎం పోటీ చేయడంతో తమ పార్టీకి పడాల్సిన ఓట్లు చీలిపోయినట్టుగా వారు అభిప్రాయంతో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడ పోటీ చేయని 13 సీట్లలో ఈ దఫా పోటీ చేసింది. అంతేకాదు రెండు విడతల పోలింగ్ లలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన పనితీరు కనబర్చిందని కొందరు నేతలు చెబుతున్నారు. మరోవైపు గత మూడు దశాబ్దాలుగా కూటమిలోని ఏ భాగస్వామి పార్టీ కూడ గెలవని 26 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం కూడ తమ పార్టీ ఘోరమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

బీహార్ లో ప్రచారానికి తమను దూరంగా ఉంచారని అసమ్మతి నేతలు ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో న్యూఢిల్లీ నుండి అసమర్ధ సిబ్బందిని బీహార్ కు పంపారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని వారు తెలిపారు.

బీహార్ ఎన్నికలకు సింగిల్ గా చూడవద్దని అసమ్మతిలోని మరోవర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్,కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల సరళిలో బీహార్ ను కూడ చూడాలని కోరుతున్నారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించాడు. నరేంద్ర మోడీపైనే రాహుల్ విమర్శలు గుప్పించారని అసమ్మతి నేతలు చెబుతున్నారు.

ఉద్యోగాలు, అవినీతిపై దృష్టి సారించి సమస్యల వారీగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఆర్జేడీని తేజస్వి విజయతీరాలకు తీసుకెళ్లలేకపోయాడు. కానీ 2015 ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీ 5 సీట్లను కోల్పోయింది. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది.

గాంధీ కుటుంబం సమర్ధత గురించి ప్రస్తుతం అసమ్మతి నేతలు అంతర్గత సంభాషణల్లో ప్రస్తావిస్తున్నారు. పార్టీని నడిపించడంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు  వైఫల్యం చెందారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.పార్టీని పునర్నిర్మించి విజయతీరాలకు చేర్చేందుకు గాను పూర్తికాలం పనిచేసే అధ్యక్షుడు అవసరమనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

ఐఎసీసీ అధ్యక్షురాలుగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఆగష్టులో 20 మంది సీనియర్లు తిరుగుబాటు చేసిన తర్వాత పూర్తికాలం పాటు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.అయితే ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.

మోడీ నేతృత్వంలోని ఎన్డీఏను ఎదుర్కోవాలంటే  ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని అసమ్మతివాదులు, సోనియా విధేయులు భావిస్తున్నారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత రాజస్థాన్ లో కూడ అదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. 

కానీ రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకొంది.ఈ ఘటనలు చోటు చేసుకొన్న తర్వాత సోనియాగాంధీ నాయకత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ పార్టీ అసమ్మతి నేతలు లేఖలు రాశారు.

ఈ ఏడాది ఆగష్టు మాసంలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్,ఆనంద్ శర్మలతో సహా కొందరు నేతలు పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలను ఎత్తి చూపారు.

పూర్తికాలం పనిచేసే సమర్ధుడైన అధ్యక్షుడు కావాలని  అసమ్మతి నేతలు సోనియాకు రాసిన లేఖలో కోరారు.యూపీలో తొమ్మిది మంది కాంగ్రెస్ నేతలను పార్టీ నుండి బహిష్కరించిన తర్వాత రెండో లేఖను అసమ్మతి నేతలు రాశారు.

బీహార్ లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాజయం తర్వాత పార్టీ చీఫ్ గా రాహుల్ గాంధీ రావడం మరోసారి ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.

గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాజయంతో కాంగ్రెస్ పార్టీ అధ్యకష పదవి నుండి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఈ పదవిలో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు.