అప్పు చెల్లించలేదని.. దళిత మహిళను వివస్త్ర చేసి.. విచక్షణరహితంగా.. ఆపై మూత్ర విసర్జన..
బీహార్ రాజధాని పాట్నాలో వడ్డీ వ్యాపారులు అమానవీయంగా వ్యవహరించారు. ఓ దళిత మహిళ పట్ల హద్దులు దాటి ప్రవర్తించారు. తన భర్త తీసుకున్న కేవలం రూ.1500 అప్పుకు వడ్డీ కట్టలేదని ఆ దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టారు. అంతటితో ఆగకుండా ఆమెపై మూత్ర విసర్జన చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు వాంగ్మూలం ఆధారంగా అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు, నలుగురు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ తరహాలోనే ఇక్కడ కూడా మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ దళిత మహిళను రౌడీలు బట్టలు విప్పి కొట్టారని, ఆ తర్వాత ఆమెపై మూత్ర విసర్జన చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో ఆ బాధిత మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పాట్నా జిల్లా ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
బాధిత మహిళ భర్త ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన ప్రమోద్‌సింగ్ వద్ద వడ్డీకి రూ.1500 అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఆ దళిత మహిళను రౌడీలు దారుణంగా కొట్టారు. గ్రామానికి చెందిన ప్రమోద్ సింగ్ తన సహచరులతో కలిసి దళిత మహిళను వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. అనంతరం ప్రమోద్ సింగ్ కొడుకు తనపై మూత్ర విసర్జన చేశాడని బాధితురాలు ఆరోపించింది. గాయపడిన మహిళ ఖుస్రుపూర్ పీహెచ్‌సీలో చికిత్స పొందుతోంది. శనివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది.
బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల నుంచి వడ్డీకి రూ.1500 తీసుకున్నారు. వడ్డీ, అసలు మొత్తం కూడా తిరిగి ఇచ్చేశారు. కానీ, వడ్డీకి వడ్డీ లెక్క చూపి.. ఎక్కువ డబ్బులు బకాయిలు ఉన్నాయని చెబుతున్నారనీ, ఆ డబ్బులు ఇవ్వకుంటే గ్రామంలో వివస్త్రను చేసి ఊరేగిస్తామని బెదిరించారు. ఇంతలో శనివారం అర్థరాత్రి ప్రమోద్ సింగ్ కొడుకు, అతని సహచరులతో కలిసి ఆమెను బలవంతంగా తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ బట్టలు విప్పి కర్రలతో దారుణంగా కొట్టారు. కానీ మహిళ అనే జాలి, దయ లేకుండా ప్రవర్తించారు. ఈ క్రమంలో ప్రమోద్ సింగ్ కొడుకు ఆ బాధిత మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఎలాగోలా అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నానని బాధితురాలు తెలిపింది.
పోలీసుల దర్యాప్తు
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి సియారామ్ యాదవ్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సియారామ్ యాదవ్ మాట్లాడుతూ.. మొత్తం వ్యవహారం డబ్బు గురించే. మహిళ ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. విచారణ తర్వాతే ఏదైనా చెప్పగలం.
పరారీలో నిందితులు
నిందితుడికి, బాధితుడికి మధ్య డబ్బు లావాదేవీలకు సంబంధించి వివాదం నడుస్తోందని విచారణలో తేలిందని రూరల్ ఎస్పీ సయ్యద్ ఇమ్రాన్ మసూద్ తెలిపారు. బాధితురాలు ఎలాంటి ఆరోపణలు చేసినా దర్యాప్తు చేస్తున్నారు. దాడి ఘటన నిర్ధారణ అయింది. ఇతర తీవ్ర ఆరోపణలకు సంబంధించి విచారణ జరుగుతోంది. నిందితులంతా ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు. వారి అన్ని రహస్య స్థావరాలపై దాడులు చేస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు.