బిహార్‌లో జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ కొడుకు ఆశిష్ మండల్‌ను పోలీసులు బరారీ కాల్పుల కేసులో అరెస్టు చేశారు. భూవివాదంలో ఆశిష్ మండల్ తుపాకీ తీసి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. 

న్యూఢిల్లీ: జనతా దళ్ యునైటెడ్ ఎమ్మెల్యే గోపాల్ మండల్ కుమారుడు ఆశిష్ మండల్‌ను బరారీ కాల్పుల కేసులో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బిహార్‌లోని భగల్‌పూర్ తిల్కమాంఝీ పోలీసు స్టేషన్ ఏరియా నుంచి అతడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ నెల మొదట్లోనే ఈ కాల్పులు జరిగాయి.

భగల్‌పూర్‌లోని బరారీ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్ఐసీ కాలనీలో ఓ భూ వివాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఎమ్మెల్యే గోపాల్ మండల్ కుమారుడు ఆశిష్ మండల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.

తన సాగు భూమిలో పని చేయడానికి వెళ్లానని బాధితుడు తెలిపాడు. అప్పుడే అక్కడికి ఆశిష్ మండల్ మరికొంత మందిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడని ఆరోపించాడు. తనతో గొడవకు దిగాడని అన్నాడు. అంతేకాదు, వారు తుపాకీ తీసి కాల్పులు జరిపారని వివరించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు జేడీయూ ఎమ్మెల్యే కొడుకు, మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Also Read: సెంట్రల్ ప్యారిస్‌లో కాల్పులు, ముగ్గురు మృతి.. అనుమానితుడి అరెస్ట్..

అందులో ఆశిష్ మండల్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. తాను తన తండ్రి వలే కాదని, ఎవరికీ భయపడబోనని ఆశిష్ మండల్ అన్నాడు. 

‘అతడిని మా సిట్ టీమ్ అరెస్టు చేసింది. కోర్టులో హాజరు పరిచి ఆ తర్వాత చర్యలు తీసుకుంటాం’ అని ఏఎస్పీ శుభమ్ ఆర్య తెలిపారు.