కేసులు తగ్గుతుండటంతో పరిస్థితులు మెల్ల మెల్లగా సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిహార్ సీఎం సంచలన ప్రకటన చేశారు. కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన అన్ని ఆంక్షలను ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఎత్తేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి ముందు జాగ్రత్తలు మాత్రం ఎప్పట్లాగే అమల్లో ఉంటాయని వివరించారు.
పాట్నా: కరోనా కేసులు(Corona Cases) క్రమంగా తగ్గిపోతుండటంతో రాష్ట్రాలు ఆంక్షలు(Restrictions) ఎత్తేసే పనిలో ఉన్నాయి. అదే క్రమంలో పాఠశాలల(Schools)ను పున:ప్రారంభించే ప్రకటనలు చేస్తున్నాయి. యూపీ ప్రభుత్వం కూడా నర్సరీ నుంచి అన్ని తరగతుల వరకు స్కూల్స్ రీఓపెన్ చేసే ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఫుల్ కెపాసిటీతో నడవడానికి అనుమతులు ఇచ్చింది. కానీ, స్విమ్మింగ్ పూల్స్ వంటి కొన్ని చోట్ల ఇంకా ఆంక్షలు అమలు చేస్తామని తెలిపింది. కానీ, బిహార్(Bihar) రాష్ట్రం మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలో కరోనా కారణంగా విధించిన ఆంక్షలు అన్నింటినీ ఎత్తేసే ప్రకటన చేసింది.
ఇటీవలే కరోనా కేసులు మళ్లీ పెరగడంతో దేశంలోని రాష్ట్రాలన్నీ ఆంక్షల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆంక్షలన్ని ఎత్తేస్తామని బిహార్ సీఎం నితీశ్ కుమార్ శనివారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ బృందంతో నితీష్ కుమార్ శనివారం భేటీ అయ్యారు. ఆ సమావేశం అనంతరమే ఆయన సంచలన ప్రకటనలు చేశారు. అన్ని తరగతులకు స్కూల్స్ సాధారణంగానే రన్ అవుతాయని వివరించారు. అలాగే, వివాహాలు, అంత్యక్రియలు వంటి వాటికీ హాజరయ్యే మందిపై లిమిట్ ఎత్తేసింది. ఇప్పుడు ఏ వేడుకకైనా ఎంత మందైనా హాజరుకావచ్చని తెలిపారు. గతంలో పెళ్లి వేడుకలకు 200 మందికి మించి హాజరు కావొద్దనే నిబంధన ఉన్నది. అలాగే, స్కూల్స్‌లోనూ 8వ తరగతి వరకు విద్యార్థులు 50 శాతం కెపాసిటీతో తరగతులు నిర్వహించవచ్చనే సడలింపు ఉన్నది. కానీ, తాజాగా, ఆ నిబంధనలు పూర్తి ఎత్తేసింది. ఈ స్వేచ్ఛ సోమవారం అంటే ఫిబ్రవరి 14వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
ఇదిలా ఉండగా, కరోనా నిబంధనలు అంటే.. అప్రొప్రియేట్ బిహేవియర్ ఎప్పటిలాగే పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అంటే ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమల్లోనే ఉంటాయని తెలిపింది.
ఇదిలా ఉండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించింది. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత లాంగ్ కోవిడ్ లక్షణాలను ప్రస్తావిస్తూ.. శరీరంలోని ప్రతి భాగంపై కరోనా వైరస్ సుదీర్ఘకాలం పాటు ప్రభావం చూపుతుందని పేర్కొంది. కరోనా మహమ్మారి సాధారణ అనారోగ్యాలతో పాటు శ్వాసనాల సంబంధ రోగాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించడం నుంచి గుండె జబ్బుల వరకు కరోనా వైరస్ కారణం అవుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ సోకిన వారిలో సుదీర్ఘకాలం పాటు కోవిడ్ లక్షణాలు ఉండటం.. శరీరంపై ప్రభావం చూపుతున్నదని పేర్కొన్నారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే.. దీని సబ్ వేరియంట్ల ప్రభావం కూడా అధికంగా ఉందనీ, దీనిపై మరింతగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్ల గురించి ఇంకా పూర్తి సమాచారం తెలియదు కాబట్టి.. దీని వ్యాప్తిని తగ్గించడంపై మనం దృష్టి పెట్టాల్సిన అవసరముందని పేర్కొంది. లాంగ్ కోవిడ్ సాధారణంగా కోవిడ్-19తో పోరాడిన చాలా వారాల తర్వాత నిర్ధారణ అవుతుంది. ఏదైనా దీర్ఘకాలిక ప్రభావాలు సాధారణంగా ప్రారంభ ఇన్ఫెక్షన్ లక్షణాలు పోయిన 90 రోజుల తర్వాత కనిపిస్తాయని WHO వాన్ కెర్ఖోవ్ పేర్కొన్నారు.
