Asianet News TeluguAsianet News Telugu

ట్రైన్ ఇంజిన్లు, బ్రిడ్జీలను దొంగిలిస్తున్న బిహార్ చోరులు.. పక్కా ప్లాన్‌తో దొంగతనాలు

బిహార్‌లో దొంగలు ట్రైన్ ఇంజిన్లు, బ్రిడ్జీలను చోరీ చేస్తున్నారు. ఈ గజదొంగలు ఒక్కో చోరీకి ఒక్కో స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అధికారులనూ మోసం చేసి, వారి కళ్లుగప్పి దొంగిలించారు. బ్రిడ్జీని దొంగిలిస్తున్నారని ఒక కానిస్టేబుల్‌నే అక్కడ నియమించే పరిస్థితులు షాక్‌కు గురిచేస్తున్నాయి.
 

bihar gangs steals train engines, bridges.. shocking details here
Author
First Published Nov 25, 2022, 2:07 PM IST

పాట్నా: బిహార్‌లో దొంగలు చాలా బిజీ అయ్యారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. డీజిల్, వింటేజ్ ట్రైన్ ఇంజిన్లను దొంగిలిస్తూ ఏదో ఘనకార్యం చేస్తున్నట్టే ధైర్యంగా చోరీ చేయడం పోలీసులను, సామాన్యులనూ షాక్‌కు గురి చేస్తున్నాయి. వారు ఏకంగా ట్రైన్ ఇంజిన్లు, బ్రిడ్జీలనూ దొంగిలిస్తున్నారు. అయితే, ఇందుకు వారు ఓ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అదేంటి? ఈ చోరీలను పోలీసులు ఎలా పట్టుకోగలిగారు? వంటి విషయాలను చూద్దాం.

బరౌనీలోని గర్హారా యార్డ్ కు రిపేరింగ్ కోసం తెచ్చిన మొత్తం డీజిల్ ఇంజిన్‌ను గతవారం దొంగిలించారు. అంతా ఒక్కసారే కాకుండా.. తరుచూ కొన్ని కొన్ని భాగాలను చోరీ చేస్తూ మొత్తంగా ఇంజిన్‌ నే అక్కడి నుంచి లేపేశారు. ముగ్గురిని అరెస్టు చేసిన తర్వాత వారి నుంచి వచ్చిన సమాచారంతో ఇంజిన్ పార్టులకు చెందిన 13 బ్యాగులను పోలీసులు రికవరీ చేసుకున్నారు. ముజఫర్‌ పూర్ ప్రభాత్ కాలనీలో ఓ చెత్త గోదాంలో వీటిని పోలీసులు కనుగొన్నారు. ఈ ఇంజిన్ దొంగిలించడానికి ఏకంగా ఒక సొరంగాన్నే దొంగలు తవ్వారని పోలీసులు తెలిపారు. 

Also Read: 60 అడుగుల ఐరన్ బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు: ఇంతకీ వాళ్లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

పూర్ణియా జిల్లాలో మరో రకం దోపిడీ వెలుగులోకి వచ్చింది. స్థానిక రైల్వే స్టేషన్‌లో ప్రజల సందర్శనకు ఉంచిన వింటేజ్ మీటర్ గేజ్ స్టీమ్ ఇంజిన్ మొత్తాన్ని ఓ మోసగాడు అమ్మేశాడు. సమస్తిపూర్ డివిజన్ నుంచి డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ ఆ స్టీమ్ ఇంజిన్‌ను అమ్మేయాలని ఆదేశిస్తున్నట్టుగా ఓ నకిలీ లేఖను ఆ మోసగాడు తయారుచేశాడు. ఆ లేఖను నమ్మి రైల్వే ఇంజినీర్ దాన్ని అమ్మేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

మరో గ్యాంగ్ ఐరన్ బ్రిడ్జీలను దొంగిలించే పనిలో ఉన్నారు. అరేరియా జిల్లాలో సీతాధార్ నదిపై కట్టిన ఐరన్ బ్రిడ్జీ నుంచి వారు ఒక్కోసారి చిన్న చిన్న భాగాలను దొంగిలించారు. బ్రిడ్జీకి చెందిన ఐరన్ యాంగిల్స్, మరికొన్ని కీలక భాగాలు కనిపించకుండా పోవడాన్ని చూసి పోలీసులు ఖంగుతిన్నారు. చేసేదేమీ లేక పోలీసులు అక్కడ సెక్యూరిటీ కోసం ఒక కానిస్టేబుల్‌ను నియమించామని ఫోర్స్‌స్ గంజ్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి నిర్మల్ కుమార్ యాదవేందు తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో 45 ఏళ్ల కిందటి స్టీల్ బ్రిడ్జీని పట్టపగలే డిస్మాంటిల్ చేసి అమ్మేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అసలు అది దొంగతనమే అని కూడా ఎవరూ అనుమానించలేకపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios