జనాభా నియంత్రణపై బీహార్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడ్డ ప్రధాని మోడీ.. ఏమన్నారంటే ?
జనాభా నియంత్రణ, మహిళా విద్య గురించి బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. నితీశ్ కుమార్ పై మండిపడ్డారు.
జనాభా నియంత్రణలో మహిళా విద్య పాత్రపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మండిపడ్డారు. మధ్యప్రదేశ్ లోని గుణలో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశాన్ని అవమానించడమేనని అన్నారు.
‘‘ఇండియా కూటమికి చెందిన పెద్ద నేత అయిన (నితీశ్ కుమార్ ను ఉద్దేశించి) 'ఘమాండియా ఘట్ బంధన్' నిన్న (బీహార్) అసెంబ్లీలో మహిళలను అసభ్య పదజాలంతో దూషించారు. వారికి సిగ్గు లేదు. దీనికి వ్యతిరేకంగా ఇండియా కూటమికి చెందిన నేతలెవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహిళల గురించి ఇలా ఆలోచించే వారు మీకు ఏమైనా మేలు చేయగలరా’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘మన తల్లులు, సోదరీమణుల పట్ల ఈ దురుద్దేశం ఉన్నవారు మన దేశాన్ని అవమానిస్తున్నారు. ఎంతలా దిగజారిపోయారు’’ అని తెలిపారు.
జనాభా నియంత్రణలో మహిళా విద్య పాత్ర గురించి నితీశ్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. అయితే ఆయన అసభ్య పదజాలం ఉపయోగించారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీలో ఆందోళన నిర్వహించారు. దీంతో నితీశ్ కుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను కేవలం మహిళ విద్య గురించే మాట్లాడానని చెప్పారు.
జనాభా పెరుగుదలను అరికట్టడానికి మహిళా విద్య ఆవశ్యకతను, బీహార్ సంతానోత్పత్తి రేటు 4.2 శాతం నుండి 2.9 శాతానికి ఎలా పడిపోయిందో నొక్కిచెబుతూ ముఖ్యమంత్రి మంగళవారం ఈ విధంగా మాట్లాడారు. వివిధ వర్గాల ఆర్థిక స్థితిగతులను వివరించే కుల సర్వే పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అనంతరం నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.