మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటు నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ అప్రమత్తమయ్యారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ హరివంశ్‌తో పాట్నాలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నితీష్ మరో యూ-టర్న్ ప్లాన్ చేసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఏ)లోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గతేడాది ఆగస్టులో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నితీష్ కుమార్.. ఆర్జేడీ , కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హరివంశ్‌ను నితీశ్ కలవడం ఇదే తొలిసారి. దాదాపు గంటన్నర పాటు ఇరువురు నేతల మధ్య జరిగిన భేటీలో కీలక విషయాలు చర్చించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయేను వీడిన తర్వాత.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హోదాలో వున్న హరివంశ్‌ను ఆ పదవి నుంచి తప్పించడానికి బీజేపీ కానీ, జేడీయూ కానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. బహుశా.. అతని ద్వారా నితీశ్ బీజేపీతో కమ్యూనికేషన్ ఛానెల్ కట్ కాకుండా చూసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఆసక్తికరంగా నితీశ్ కుమార్ గడిచిన ఐదు రోజులుగా తన పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం హరివంశ్‌తో సమావేశమయ్యారు. మహారాష్ట్రలోని ఎన్సీపీలో జరిగినట్లే జేడీయూలోనూ బీజేపీ చీలిక తెస్తుందేమోనని నితీశ్ కుమార్ భయపడుతున్నారా అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి తోడు జేడీయూ ఎంపీలు వచ్చే ఎన్నికల్లో 2024కి టికెట్లు వస్తాయో రావో అని భయపడుతున్నారు.
