బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇంకా బీజేపీతో టచ్‌లో ఉన్నారని, అవసరమైతే మళ్లీ ఆ పార్టీతో కలిసి పని చేయడానికి సిద్ధమవుతారని ప్రశాంత్ కిశోర్ తీవ్ర ఆరోపణలు చేశారు. జేడీయూ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్ ద్వారా ఆయన బీజేపీతో సంప్రదింపులకు ద్వారాలు తెరిచే ఉంచారని అన్నారు. 

న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. జేడీయూపై సంచలన ఆరోపణలు చేశారు. మళ్లీ అవసరమైతే బీజేపీతో నితీశ్ కుమార్ చేతులు కలుపొచ్చని వివరించారు. ఇప్పటికీ ఆయన బీజేపీతో టచ్‌లోనే ఉన్నారని ఆరోపించారు. ఇందుకోసం జేడీయూ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్ ద్వారా బీజేపీతో ద్వారాలు తెరుచుకునే ఉంచారని వివరించారు. ఈ ఆరోపణలను జేడీయూ తీవ్రంగా వ్యతిరేకించింది.

బిహార్‌లో పాదయాత్ర చేస్తూ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ప్రవేశించే సంకేతాలు ఇస్తున్న ప్రశాంత్ కిశోర్ ఈ రోజు పీటీఐతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.‘నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి నిర్మాణంలో యాక్టివ్‌గా ఉన్నారని భావించే వారందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. ఆయన ఇప్పటికీ బీజేపీతో టచ్‌లో ఉన్నారు. ఆయన పార్టీ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్ ద్వారా బీజేపీతో ఒక లైన్ ఓపెనే పెట్టుకున్నారు’ అని పేర్కొన్నారు. అందుకే హరివంశ్‌ను రాజీనామా చేయాలని అడగలేదని తెలిపారు.

బీజేపీతో పని చేసే పరిస్థితులు వస్తే మాత్రం.. ఆయన కచ్చితంగా ఆ పార్టీతో చేతులు కలిపి పని చేస్తారని అన్నారు. ఈ విషయంపై హరివంశ్ నుంచి స్పందన రాలేదు.

Also Read: ఒంటరి వాడినైతానని.. నితీష్ భయపడుతున్నారు.. పీకే సెటైర్లు

కాగా, ప్రశాంత్ కిశోర్ ఆరోపణలను జేడీయూ తోసిపుచ్చింది. మళ్లీ జీవితంలో బీజేపీతో చేతులు కలుపబోనని సీఎం నితీశ్ కుమార్ బహిరంగంగా ప్రకటించారని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి అన్నారు. ఆయన ఆరోపణలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పీకే కేవలం గందరగోళం సృష్టించేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు.